ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో బయోపిక్ ల ట్రెండ్ నడుస్తోంది. ఇప్పటికే సావిత్రి, ఎన్టీఆర్, వైఎస్సార్ వంటి వారిపై బయోపిక్ లు వచ్చాయి. త్వరలోనే చంద్రబాబు, పుల్లెల గోపీచంద్ ల బయోపిక్ లు రాబోతున్నాయి. ఈ క్రమంలో చిరంజీవి బయోపిక్ కూడా ఉంటుందా..? అని నాగబాబుని ప్రశ్నించగా.. దానికి ఆయన ఆసక్తికర సమాధానం చెప్పుకొచ్చింది. 

ఏ బయోపిక్ అయినా.. ఉన్నది ఉన్నట్లుగా తీస్తేనే అది బయోపిక్ అవుతుందని, ఫేబ్రికేట్ చేస్తే అది పురాణం అవుతుందని అన్నారు. కథానాయకుడు, యాత్ర సినిమాలను చూడలేదని, త్వరలో విడుదల కాబోతున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాపై నమ్మకం కలుగుతుందని అన్నారు. ఎన్టీఆర్ కెరీర్ లో వర్మ ఇంటరెస్టింగ్ పాయింట్ తీసుకొని 
సినిమా రూపొందించారని కాబట్టి సినిమా ఆసక్తికరంగా ఉండే ఛాన్స్ ఉందని అన్నారు.

ఇక చిరంజీవి బయోపిక్ తీసే ఆలోచన తనకు లేదని, రామ్ చరణ్ కి కూడా ఉండి ఉండదని అన్నారు. చిరంజీవి కూడా నా మీద బయోపిక్ తీస్తే బావుండని అనుకునే మనిషి కాదని, ఆయనకి సెల్ఫ్ ప్రమోషన్ నచ్చదని అన్నారు. బయోపిక్ తీయాలంటే కొన్ని లక్షణాలు ఉండాలని చెప్పిన ఆయన 'డర్టీ పిక్చర్' సినిమాను ఉదాహరణగా చెప్పారు.

ఒక ఆడపిల్ల జీవితంలో ఎలాంటి కష్టాలను ఎదుర్కొందనే విషయాలను రియలిస్టిక్ గా చూపించారని..  సిల్క్ స్మిత గొప్పనటి కాకపోయినా ఆమె బయోపిక్ సక్సెస్ అయిందని  అన్నారు. సక్సెస్ ఫుల్ వ్యక్తుల మీద సినిమాలు తీస్తే అందుకే ఏమీ ఉండదని.. జీవితంలో ఎత్తుపల్లాలు, సంతోషం, బాధ, విజయం అన్నీ ఉంటేనే సినిమా బాగా వస్తుందని అన్నారు.