నాగచైతన్య తన ఫెయిల్యూర్స్ నుంచి బయిటపడేందుకు రీమేక్ ల మార్గం ఎంచుకున్నట్లుంది. సవ్యసాచి చిత్రం ఫ్లాఫ్ కావటంతో ఆయన కథలు, దర్శకుల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందుకే ఇప్పుడు ఆయన రీమేక్ కమిటయ్యినట్లు తెలుస్తోంది. 

వివరాల్లోకి వెలితే..బాలీవుడ్‌లో బ్లాక్‌ బస్టర్‌ విజయం అందుకున్న ‘బరైలీ కీ బర్ఫీ’ రీమేక్‌ చిత్రంలో నాగచైతన్య నటిస్తున్నట్లు  తెలుగు సినీ వర్గాల సమాచారం. అశ్విని అయ్యర్‌ తివారి తెరకెక్కించిన ‘బరైలీ కీ బర్ఫీ’ చిత్రంలో ఆయుష్మాన్‌ ఖురానా, రాజ్‌కుమార్‌ రావు, కృతిసనన్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం మంచి విజయం అందుకుంది. 

ఇందులో ఒక  హీరోగా నాగచైతన్యను ఎంపికచేసినట్లు తెలుస్తోంది. ప్రముఖ రచయిత కోనవెంకట్‌ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఇక ఈ   చిత్రం కథేంటంటే.. మ్యారేజ్ చేసుకోమని ఇంట్లో పేరెంట్స్ బలవంతపెడుతుండడంతో హీరోయిన్ రైలెక్కి పారిపోతుంది. అలా బయిలుదేరిన ఆమెకు  ఓ రైల్వే స్టేషన్‌లో బుక్‌ షాప్‌ కనిపిస్తుంది. అందులో ‘బరైలీ కీ బర్ఫీ’ అనే పుస్తకాన్ని కొంటుంది. దాన్ని చదివిన తర్వాత ఆ రచయితను కలవాలనుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందన్నదే ఈ సినిమా కథ. 

ఇక ప్రస్తుతం నాగచైతన్య చేస్తున్న చిత్రం విషయానికి వస్తే... అక్కినేని నాగచైతన్య, సమంత జంటగా నటిస్తున్న చిత్రానికి మజిలీ అనే టైటిల్ కన్ఫర్మ్ చేశారు. ఈ చిత్రానికి దేర్ ఈజ్ లవ్.. దేర్ ఈజ్ పెయిన్ అనే క్యాప్షన్ పెట్టారు. అంటే ప్రేమ ఉంది.. బాధ ఉందని అర్థం. ఈ చిత్ర ఫస్ట్ లుక్ రిలీజైంది. ఫస్ట్ లుక్  కూడా చాలా ఎమోషనల్ గా ఉంది. నాగచైతన్య, సమంత లుక్ ఇందులో చాలా కొత్తగా ఉంది. 

నిన్నుకోరి లాంటి ఎమోషనల్ హిట్ సినిమా తెరకెక్కించిన శివ నిర్వాణ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. వైజాగ్ నేపథ్యంలో ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ తెరకెక్కుతోంది. దివ్యాంశ కౌశిక్ ఈ చిత్రంలో రెండో హీరోయిన్ గా నటిస్తున్నారు. రావు రమేష్, పోసాని కృష్ణమురళి, సుబ్బరాజు ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నారు. గోపి సుందర్ సంగీతం అందిస్తుండగా.. విష్ణు వర్మ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. సాహు గరపాటి, హరీష్ రెద్ది మజిలీ చిత్రాన్ని షైన్ స్క్రీన్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.