మెగా వారసురాలు నిహారిక కొణిదెల వివాహం రాజస్ధాన్‌లోని ఉదయ్‌పూర్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. వేద మంత్రాల నడుమ చైతన్య జొన్నలగడ్డ ఆమె మెడలో మూడు ముళ్లు వేసి, ఏడడుగులు వేశారు.

నగరంలోని ఉదయ్ విలాస్‌లో అందంగా అలంకరించిన మండపంలో ఇద్దరూ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. పెళ్లిని పురస్కరించుకుని నిహారిక బంగారు వర్ణం దుస్తుల్లో మెరిసిపోయారు.

కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు ఆ వివాహానికి హాజరై కొత్త జంటను ఆశీర్వదించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. పలువురు సినీ ప్రముఖులు, మెగా అభిమానులు నూతన దంపతులకు శుభాకాంక్షలు చెప్పారు. మరోవైపు తన గారాలపట్టి ఓ ఇంటికి కోడలు కావడంతో నాగబాబు భావోద్వేగానికి గురయ్యారు.

‘సరికొత్త జీవితం ఆరంభించబోతున్న నీకు శుభాకాంక్షలు. తను స్కూలుకు వెళ్లిన మొదటి రోజు నాకింకా గుర్తుంది. అప్పుడైతే సాయంత్రానికి ఇంటికి తిరిగి వచ్చేది. కానీ ఇప్పుడలా కాదు. నా చిన్నారి కూతురు స్కూలుకు వెళ్లేంత పెద్దదై పోయిందనే నిజం నమ్మడానికే నాకు చాలా ఏళ్లు పట్టింది. తనతో ఇరవై నాలుగు గంటలు ఆడుకోలేననే బాధ వెంటాడేది. ఇంకెన్నాళ్లు ఇలాంటి ఫీలింగ్‌ ఉంటుందో.. కాలమే నిర్ణయిస్తుంది.. నిన్ను ఎంతగానో మిస్సవుతున్నా నిహా తల్లి’’ అంటూ ట్వీట్ చేశారు.