రామ్ చరణ్ హీరోగా నాగబాబు 'ఆరెంజ్' సినిమాను నిర్మించాడు. ఆ సినిమా ఎంత పెద్ద ఫ్లాప్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ సమయంలో సినిమా వల్ల దారుణంగా నష్టపోయాడు నాగబాబు.

తన అప్పులని తీర్చడానికి తన అన్నదమ్ములు సహాయం చేశారని చాలా సార్లు నాగబాబు వెల్లడించాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగబాబు మరోసారి ఈ విషయంపై స్పందించాడు.

ఆయన మాట్లాడుతూ.. ''ఆరెంజ్ సినిమా విడుదలైన తరువాత నేను ఎంతగా నష్టపోయాననే విషయం తెలుసుకొని షాక్ అయ్యాను. నా ఆస్తులన్నీ అమ్మినా.. ఆ అప్పులు తీరవనే విషయం నాకు అర్ధమైంది. అనుకున్న దానికంటే బడ్జెట్ పెరిగిపోవడమే దానికి కారణమని తెలిసింది. అలాంటి పరిస్థితుల్లో నా సోదరులు ఇద్దరూ నాకు సపోర్ట్ గా నిలిచారు.

అప్పుడే బుల్లితెరపై దృష్టి పెట్టాను. జబర్దస్త్ షో, టీవీ సీరియళ్ళ ద్వారా పేరు, డబ్బు వచ్చాయి. నాకు ఎదురైన సమస్యలతో నేను చాలా నేర్చుకున్నాను. కష్టాలు వచ్చినప్పుడు పారిపోకుండా పోరాడాలనే విషయాన్ని గ్రహించాను. నాలో ధైర్యం నింపి, నన్ను ఆదుకున్న నా సోదరులంటే నాకు ప్రాణం'' అంటూ చెప్పుకొచ్చారు.