Asianet News TeluguAsianet News Telugu

అసలు చంద్రబోస్ ఎవరు ? సింగర్ కావాల్సిన వ్యక్తి లిరిసిస్ట్ గా .. అలా జరిగుంటే ఆస్కార్ మిస్సయ్యేదేమో

నాటు నాటు సాంగ్ ఆస్కార్ అవార్డు సాధించడం వెనుక చాలా మంది కృషి ఉంది. అందులో అచ్చతెలుగు పదాలతో నాటు నాటు పాట రాసిన లిరిసిస్ట్ చంద్రబోస్ క్రెడిట్ కూడా ఎంతైనా ఉంది అని చెప్పాలి.

Naatu Naatu lyricist Chandrabose wants singer first
Author
First Published Mar 13, 2023, 10:58 AM IST

గత కొన్ని వారాలుగా రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రం అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటుతూ వచ్చింది.అనేక ప్రశంసలు పొందింది. హాలీవుడ్ అభిమానుల హృదయాలు దోచుకుంది. అవన్నీ ఒకెత్తయితే ఇది ఒక్కటీ మరో ఎత్తు.. 130 కోట్ల మంది భారతీయులు గర్వించేలా తెలుగోడు తెరకెక్కించిన 'ఆర్ఆర్ఆర్' చిత్రం ఆస్కార్ అవార్డుని సొంతం చేసుకుంది. మన 'నాటు నాటు' పాటకి పట్టం కడుతూ అకాడమీ అవార్డ్స్ సంస్థ ఆస్కార్ అవార్డు ప్రకటించింది. 

నాటు నాటు సాంగ్ ఆస్కార్ అవార్డు సాధించడం వెనుక చాలా మంది కృషి ఉంది. అందులో అచ్చతెలుగు పదాలతో నాటు నాటు పాట రాసిన లిరిసిస్ట్ చంద్రబోస్ క్రెడిట్ కూడా ఎంతైనా ఉంది అని చెప్పాలి. తెలంగాణాలో ఉమ్మడి వరంగల్ జిల్లా చల్లగరిగ అనే మారుమూల గ్రామంలో మొదలైన చంద్రబోస్ ప్రయాణం ఆస్కార్ వరకు చేరింది అంటే అద్భుతం అనే చెప్పాలి. చంద్రబోస్ అసలు పేరు 'కనుకుంట్ల సుభాష్ చంద్రబోస్. 

Naatu Naatu lyricist Chandrabose wants singer first

సినిమాల్లోకి వచ్చాక పేరు షార్ట్ గా ఉండడం కోసం సింపుల్ గా చంద్రబోస్ అని పెట్టుకున్నారు. చంద్రబోస్ అచ్చతెలుగులో రాసిన నాటు నాటు పాటలోని అర్థం వెస్ట్రన్ ఆడియన్స్ కి తెలియకపోవచ్చు. కానీ ఆ సౌండింగ్ బాగా నచ్చేసింది. తెలుగు ప్రేక్షకులైతే లిరిక్స్, మ్యూజిక్, డ్యాన్స్ ఇలా ప్రతి అంశంలో నాటు నాటు సాంగ్ ని బాగా ఎంజాయ్ చేశారు. 

చంద్రబోస్ 1995లో శ్రీకాంత్ తాజ్ మహల్ చిత్రంతో లిరిసిస్ట్ గా తన కెరీర్ ప్రారంభించారు. ఇప్పటి వరకు ఆయన 850 పైగా చిత్రాలకు 3600 పైగా పాటలు అందించారు. ఎమోషనల్ సాంగ్, మాస్ బీట్స్, మెలోడీ , ఐటెం సాంగ్స్ ఇలా పాట ఏదైనా ఆచ్చతెలుగులో లోతైన భావాలతో లిరిక్స్ అందించడం చంద్రబోస్ కి వెన్నతో పెట్టిన విద్య. 

చిన్నతనంలో చంద్రబోస్ కి గాయకుడు కావాలనే కోరిక ఉండేదట. తన ఇంటి పక్కనే శివాలయం ఉండడంతో ఆ పాటలు వింటూ పాడుతూ పెరిగారు. ఉత్సవాలకు శివాలయంలో పాటలు పాడడం చంద్రబోస్ కి అలవాటట. ఆ అలవాటు సినిమాల్లో పాటలు పాడాలనే కోరికగా మారింది. 11 ఏట నుంచే పాటలు రాయడం, పాడడం లాంటి ప్రయత్నాలు మొదలు పెట్టారు. గాయకుడిగా అవకాశాల కోసం తన స్నేహితుల సహాయంతో పలువురు సంగీత దర్శకులు, నిర్మాతల చుట్టూ తిరిగారట. కానీ అందరి నుంచి చుక్కెదురైనట్లు చంద్రబోస్ తెలిపారు. 

Naatu Naatu lyricist Chandrabose wants singer first

గాయకుడు కావడం కష్టంతో కూడుకున్న పని. స్టూడియోకి వెళ్లి వినిపించాలి. కాబట్టి రచయితగా ప్రయత్నించు అని చంద్రబోస్ సన్నిహితులు సూచించారట. అప్పటి నుంచి చంద్రబోస్ పాటల రచనపై ఫోకస్ పెట్టారు. ఇప్పుడు టాలీవుడ్ లోనే కాదు అంతర్జాతీయంగా ప్రశంసలు దక్కించుకునే లిరిసిస్ట్ గా ఎదిగారు. 

పెళ్లి సందడి, తమ్ముడు, ఖుషి, మురారి, ఆది, నా ఆటోగ్రాఫ్, గబ్బర్ సింగ్, మగధీర, గంగోత్రి, బొమ్మరిల్లు, రంగస్థలం, పుష్ప, ఆర్ఆర్ఆర్ లాంటి అద్భుత చిత్రాలకు చంద్రబోస్ సాహిత్యం అందించారు. తన కెరీర్ లో అతి తక్కువ టైంలో రాసిన పాట కొమరం పులి చిత్రంలోని 'మారాలంటే లోకం' అని చంద్రబోస్ అన్నారు. కేవలం 40 నిమిషాల్లోనే ఆ పాటని రాశానని చంద్రబోస్ అన్నారు. ఇక నాటు నాటు పాటని ఫస్ట్ సిట్టింగ్ లోనే 90 శాతం ఫినిష్ చేశానని చంద్రబోస్ అన్నారు. మిగిలిన 10 శాతం కోసం ఏడాది సమయం పట్టింది అని అన్నారు. 

రాజమౌళి చెప్పిన సందర్భం ప్రకారం చంద్రబోస్ మూడు వెర్షన్స్ రాశారు. అందులో రెండవ వెర్షన్ నాటు నాటు సాంగ్. మొదట నా పాట పేరు నాటు నాటు అని రాయగా.. నా పాట చూడు నాటు నాటు అని మార్చమని కీరవాణి సలహా ఇచ్చినట్లు చంద్రబోస్ తెలిపారు. ఆస్కార్ వేదికపై చంద్రబోస్ అవార్డు అందుకుంటూ నమస్తే అని తెలుగులో అందరిని పలకరించారు. ఏం జరిగినా అంతా మన మంచికే అంటే ఇదేనేమో.. చంద్రబోస్ తాను అనుకున్నట్లుగా గాయకుడు అయి ఉంటే.. ఆస్కార్ ఛాన్స్ మిస్సయ్యేదేమో!

Follow Us:
Download App:
  • android
  • ios