తనకు ఇవ్వాల్సిన డబ్బులివ్వాలని అడిగితే సదరు వ్యక్తి తనని చంపేస్తానని బెదిరింపులకు దిగుతున్నారని, అతనిపై చర్యలు తీసుకోవాలని కోరుకుతున్నారు ప్రముఖ సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్‌. ఈ మేరకు ఆయన బంజారాహిల్స్ పోలీస్‌ స్టేషన్‌లో ఆ వ్యక్తిపై ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేశారు. ఇంతకు ఎవరతను, ఏం జరిగిందనేది పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ కళింగరావు చెప్పిన కథనం ప్రకారం చూస్తే..

`సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్‌ ఫిల్మ్ నగర్‌లో నివాసం ఉంటున్నాడు. ఆయన రోజూ మార్నింగ్‌ కేబీఆర్‌ పార్క్ లో వ్యాయమానికి వెళ్తుంటారు. ఈ క్రమంలో ఆయనకు ఫిల్మ్ నగర్‌లోని అపోలో ఆసుపత్రి సమీపంలో ఉండే తిరుపతయ్యతో పరిచయం ఏర్పడింది. 

2018లో జూన్‌లో తిరుపతయ్య కర్నూలు జిల్లా నందికొట్కూరుకి చెందిన గుత్తేదారు అయిన తన మామ రంగస్వామితో కలిసి వందేమాతరం శ్రీనివాస్‌ని కలిశారు. తన వ్యాపారవిస్తరణ కోసం రూ.ముప్పై లక్షలు కావాలని, మూడు, నాలుగు నెలల్లో తిరిగి చెల్లిస్తామని తెలిపారు. దీంతో వారిని నమ్మిన వందేమాతరం.. వారు అడిగిన అమౌంట్‌ని పలు దఫాలుగా ఇచ్చాడు. కానీ వారు తిరిగి చెల్లించలేదు. 

దీంతో వందేమాతరం తన స్నేహితుడు మధుసూదన్‌రెడ్డితో కలిసి తిరుపతయ్య ఇంటికి వెళ్ళి తన డబ్బులు చెల్లించాలని అడిగారు. డబ్బులు ఇవ్వకపోగా వందేమాతరంపై బెదిరింపులకు దిగాడు తిరుపతయ్య. డబ్బులు అడిగితే చంపేస్తామంటూ బెదిరించారు. దీంతో వందేమాతరం బంజారాహిల్స్ పోలీస్‌ స్టేషన్‌ కంప్లెయింట్‌ చేశారు. తిరుపతయ్య, రంగస్వామిలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నా`మని తెలిపారు.