Asianet News TeluguAsianet News Telugu

Sirivennela death: కవీశ్వరుడా శివైక్యం అయ్యావా... సిరివెన్నెలకు మిత్రుడు ఇళయరాజా నీరాజనం!

ఇళయరాజా మిత్రుడు సిరి వెన్నెలకు పదాలతో నీరాజనం తెలిపారు. సిరివెన్నెలతో ఆయనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. సాహీతీవేత్తగా సిరివెన్నెల ఔన్నత్యాన్ని ఈ సందర్భంగా కొనియాడారు.

music director ilayaraja emotional note on sirivennela demise
Author
Hyderabad, First Published Dec 1, 2021, 10:42 AM IST

తెలుగు భాషకు వన్నెతెచ్చిన కవిరాజు సిరివెన్నెల సీతారామశాస్త్రి హఠాన్మరణం దేశవ్యాప్తంగా ఉన్న సాహితీప్రియులను దిగ్బ్రాంతికి గురిచేసింది. పండితుల నుండి సామాన్యుల వరకు సిరివెన్నెల సాహిత్యం ప్రభావితం చేయగా.. ఆయన మరణాన్ని ఎవరూ జీర్ణించుకోలేకున్నారు. కాగా ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజాతో సిరివెన్నెల దశాబ్దాల పాటు పనిచేశారు. ఇళయరాజా స్వరాలకు సిరివెన్నెల సాహిత్యం తోడై అద్భుతం చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. దీంతో ఇళయరాజా మిత్రుడు సిరి వెన్నెలకు పదాలతో నీరాజనం తెలిపారు. సిరివెన్నెలతో ఆయనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. సాహీతీవేత్తగా సిరివెన్నెల ఔన్నత్యాన్ని ఈ సందర్భంగా కొనియాడారు. 

వ్యాపారాత్మక సినిమా పాటల్లో సైతం.. కళాత్మకతని, కవితాత్మని అందించి..తనదైన ముద్రతోఅందమైన, అర్థవంతమైన,సమర్థవంతమైన పాటలని మన మెదళ్లలోకి జ్ఞానగంగలా ప్రవహింపచేసిన కవీశ్వరుడు సీతారాముడు..
ఎన్నో వత్సరాల ప్రయాణం మాది, శ్రీ వేటూరి గారికి సహాయకుడిగా వచ్చి...అతి తక్కువ కాలంలో..శిఖర స్థాయికి చేరుకున్న  సరస్వతీ పుత్రుడు...

మా ఇద్దరి కలయికలో ఎన్నో పాటలు ప్రాణం పోసుకున్నాయి..తన పాటల "పదముద్రలు " నా హార్మోనియం మెట్లపై నాట్యం చేశాయి... రుద్రవీణ, స్వర్ణకమలం, బొబ్బిలిరాజా ఎన్ని సినిమాలు, ఎన్ని పాటలు...రేపు రాబోయే 
" రంగమార్తాండ " కూడా..
సీతారాముడు  రాసిన పాటలకు నువ్వా నేనా అంటూ పోటీపడుతూ సంగీతాన్ని అందించిన సందర్భాలెన్నో.....!!

సీతారాముడు పాటతో ప్రయాణం చేస్తాడు

పాటతో అంతర్యుద్ధం చేస్తాడు..
పాటలో అంతర్మథనం చెందుతాడు..
పాటని ప్రేమిస్తాడు..

పాటతో రమిస్తాడు..

పాటని శాసిస్తాడు..

పాటని పాలిస్తాడు.. 
పాట నిస్తాడు....

మన భావుకతకి భాషను అద్ది. 
మనకు తెల్సిన పాటలా చెవుల్లోకి ఒంపుతాడు... అందుకే సీతారాముడి పాటలు ఎప్పటికీ  గుర్తుంటాయి..

తన సాహిత్యం నాతో ఆనంద తాండవం చేయించాయి
నాతో శివ తాండవం చేయించాయి..
"వేటూరి"  నాకు తెలుగు సాహిత్యం మీద ప్రేమను పెంచితే...
"సీతారాముడు"  నాకు తెలుగు సాహిత్యం మీద గౌరవాన్ని పెంచాడు...ధన్యోస్మి మిత్రమా..!!
ఇంత త్వరగా  సెలవంటూ శివైక్యం చెందడం మనస్సుకు బాధగా ఉంది..
 పాటకోసమే బ్రతికావు,బ్రతికినంత కాలం పాటలే రాసావు....ఆ ఈశ్వరుడు నీకు సద్గతిని ప్రసాదించాలని కోరుకుంటున్న- ఇళయరాజా

అంటూ ఆయన సిరివెన్నెలకు అంతిమ వీడ్కోలు తెలియాజేశారు. కాగా నేడు మహాప్రస్థానంలో సిరివెన్నెల అంతిమ సంస్కారాలు జరగనున్నాయి. సిరివెన్నెల అంతిమ సంస్కారాలకు చిత్ర పరిశ్రమ ప్రముఖులు హాజరుకానున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios