ప్రభాస్‌ తన అభిమానులకు మరో అప్‌డేట్‌ ఇచ్చారు. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో రూపొందే సినిమాకి సంబంధించి ఇప్పటి వరకు కాస్టింగ్‌ని ప్రకటిస్తూ వచ్చిన బృందం తాజాగా, టెక్నీషియన్లని ప్రకటించడం స్టార్ట్ చేశారు. దీనికి జాతీయ అంతర్జాతీయ స్టార్స్, టెక్నీషియన్లని ఎంపిక చేస్తూ సినిమాపై హైప్‌ పెంచుకుంటూ వెళ్తున్నారు. ఇప్పటికే ఇందులో బాలీవుడ్‌ బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌ని కీలక పాత్ర కోసం ఎంపిక చేశారు. దీంతోపాటు హీరోయిన్‌ బాలీవుడ్‌ లేడీ సూపర్‌ స్టార్‌ దీపికా పదుకొనెని ఫైనల్‌ చేశారు. 

తాజాగా సంగీత దర్శకుడు, కెమెరామెన్‌ లను ప్రకటించారు. ఇందులో సంగీత దర్శకుడిగా మిక్కీ జే మేయర్‌ని ఖరారు చేశారు. ఆయన గతంలో నాగ్‌ అశ్విన్‌ రూపొందించిన `మహానటి` చిత్రానికి సంగీత దర్శకుడిగా పనిచేసిన విషయం తెలిసిందే. మరోవైపు డైరెక్టర్‌ ఆఫ్‌ ఫోటోగ్రఫీగా డాని శాంచెజ్‌-లోపేజ్‌ని ఖరారు చేశారు. ఆయన కూడా గతంలో `మహానటి` చిత్రానికి పనిచేశారు. టెక్నీకల్‌గా `మహానటి` టీమ్‌ని రిపీట్‌ చేస్తున్నారని చెప్పొచ్చు.  ఈ సందర్భంగా వారికి వెల్‌కమ్‌ బ్యాక్‌ అంటూ స్వాగతం పలికారు చిత్ర నిర్మాతలు. 

మరోవైపు దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ స్పందిస్తూ, `మేం `మహానటి` సినిమా టైమ్‌లో ఓ ప్రపంచాన్ని సృష్టించాము. ఇప్పుడు భవిష్యత్‌లో మరో ప్రపంచాన్ని సృష్టించబోతున్నాం. వెల్‌కమ్‌ బాయ్స్ `అంటూ ట్వీట్‌ చేశారు నాగ్‌ అశ్విన్‌. ఈచిత్రాన్ని వైజయంతి ఫిల్మ్స్ పతాకంపై అశ్వినీదత్‌ దాదాపు ఐదువందల కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు.