సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాల పరంగా దూకుడు పెంచాడు. వరుస పెట్టి సినిమాలు చేయడం మొదలుపెట్టాడు. ఏడాది సమయంలో 'కాలా' సినిమాతో పాటు 'పేట్టా' సినిమాను కూడా పూర్తి చేశాడు. వచ్చే ఏడాది జనవరిలో 'పేట్టా' సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సినిమా తరువాత రజినీకాంత్ సినిమాలు మానేసి రాజకీయాలతో బిజీ అయిపోతారని అనుకున్నారు. కానీ రజినీకాంత్ మాత్రం అలా చేయడంలేదు. దర్శకుడు మురుగదాస్ తో కలిసి సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు.

రజినీకాంత్ తో 'పేట్టా' సినిమాను నిర్మించిన సన్ పిక్చర్స్ సంస్థ ఈ సినిమాను కూడా ప్రొడ్యూస్ చేయబోతుంది. ఈ సినిమా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో సాగుతుందని తెలుస్తోంది. రజినీకాంత్ రాజకీయాలకు ఈ సినిమా వారధిలా నిలుస్తుందని అంటున్నారు. ప్రస్తుతం మురుగదాస్ స్క్రిప్ట్ సిద్ధం చేస్తూనే.. సినిమా ప్రీప్రొడక్షన్ పనులు కూడా మొదలుపెట్టేశాడు.

సినిమాకు లెజండరీ సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్ పని చేయనున్నారు. గతంలో రజినీకాంత్, సంతోష్ శివన్ కాంబినేషన్ లో 'దళపతి' సినిమా వచ్చింది. మళ్లీ ఇంత కాలానికి వీరిద్దరూ కలిసి  పని చేయనున్నారు.