బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ కేసులో రోజు రోజుకు కొత్త విషయాలు బయటపడుతున్న విషయం తెలిసిందే. సుశాంత్‌కి ప్రాణాపాయం ఉందని ఆయన తండ్రి కేకే సింగ్‌ ఫిబ్రవరి 25నే పోలీసులకు ఫిర్యాదు చేశానని, కానీ పోలీసులు దాన్ని పట్టించుకోలేదని ఆరోపించిన విషయం తెలిసిందే. 

తాజాగా దీనిపై ముంబయి పోలీసులు స్పందించారు. సుశాంత్‌ తండ్రి ఇటీవల చేసిన వ్యాఖ్యాలపై డీసీపీ పరమ్‌జిత్‌ ఎస్‌ దహియా స్పందించారు. ఆయన మాకు సుశాంత్‌ భద్రతపై ఫిర్యాదు చేసిన విషయం వాస్తవమే. అయితే తన కొడుకు భద్రతపై తనకు ఆందోళనగా ఉందని, మిరాండా అనే వ్యక్తిని అరెస్టు చేయాలని ఆయన మాకు వాట్సప్ ద్వారా‌ మెసేజ్‌ చేశారు.  లిఖితపూర్వకంగా ఎలాంటి ఫిర్యాదు ఇవ్వాలని ఆయనకు అప్పుడే చెప్పడం జరిగింది. కానీ మాకు ఆయన నుంచి ఫిబ్రవరిలో ఎలాంటి లిఖిత పూర్వక ఫిర్యాదు రాలేదు రాలేదని తెలిపారు. సుశాంత్‌ని ఆయన ప్రియురాలు రియా ఆత్మహత్యకు ప్రేరెపించేలా ప్రవర్తించిందని, సుశాంత్ దగ్గర డబ్బులు కూడా తీసుకున్నట్లు ఆయన ఆరోపించినట్టు చెప్పారు. ప్రస్తుతం ఈ కేసులో అనుమానితురాలిగా ఉన్న రియా కనిపించడం లేదని డీజీపీ వెల్లడించారు.

 మరోవైపు సుశాంత్‌ మాజీ మేనేజర్‌ దిశా సలియన్‌ మృతి కేసుని సైతం వేగవంతం చేశారు పోలీసులు. ఆమె చనిపోవడానికి ముందు సుశాంత్‌తో ఫోన్‌లో మాట్లాడిందని, ఆయనకు ఏదో విషయాన్ని చెప్పిందని, దీనిపై సుశాంత్‌ ప్రెస్‌మీట్‌ పెట్టాలనుకున్నట్టు సుశాంత్‌ స్నేహితుడొకరు ఇటీవల తెలియజేయడంతో దిశా కేసుని సీరియస్‌గా తీసుకున్నారు. ఆమె మృతి కోణంలోనూ దర్యాప్తు ముమ్మరం చేశారు. 

 అందులో భాగంగా ఈ కేసుకు సంబంధించి ఎవరికైనా ఆధారాలుగానీ, సమాచారం గానీ తెలిస్తే తమకి ఆ వివరాలు అందజేయాలని పోలీసులు బుధవారం ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సుశాంత్‌ మాజీ మేనేజర్‌ దిశా సలియన్‌ జూన్‌ 8న ముంబైలోని మలద్‌ ప్రాంతంలో పెద్ద ఆపార్ట్ మెంట్‌ నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఆమె మృతి కేసుని మల్వాని పోలీసులు యాక్సిడెంటల్‌ డెత్‌గా పరిగణిస్తున్నారు. దిశ మరణంపై సోషల్‌ మీడియా, వార్తాపత్రికలు, టీవీ చానెళ్లలో పలు కథనాలు వెల్లువెత్తుతుండటంతో కేసులో మరింత సమాచారం కోసం ఈ కథనాలను పరిశీలిస్తామని పోలీస్‌ అధికారులు తెలిపారు. ఈ కేసుకి సంబంధించి ఏ సమాచారమైనా ప్రజలు తమతో పంచుకోవచ్చని తెలిపారు. 

 మరోవైపు దిశ సలియాన్‌ ఆత్మహత్య చేసుకోలేదని ఆమెపై లైంగిక దాడికి పాల్పడి హత్య చేశారని బీజేపీ ఎంపీ నారాయణ్‌ రాణే సంచలన ఆరోపణలు చేశారు. ఆమె ప్రైవేట్‌ భాగాలపై గాయాల, మరకలున్నాయని పోస్ట్‌మార్టం నివేదికలో తేలిందని ఆయన పేర్కొన్నారు. మరోవైపు సుశాంత్‌ కేసుని కేంద్ర ప్రభుత్వం సీబీఐకి అప్పగించిన విషయం తెలిసిందే. దీంతో తాజాగా సీబీఐ అధికారులు కూడా రంగంలోకి దిగారు. ఇక మున్ముందు ఈ కేసులో ఇంకెన్ని కొత్త విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి.