బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య వ్యవహారంలో పోలీసులు స్పీడు పెంచారు. సుశాంత్‌ ఆత్మహత్య చేసుకున్నట్టుగా ధృవీకరించినా అందుకు కారణాలను కనిపెట్టే పనిలో ఉన్నారు  పోలీసులు. ఆత్మహత్యకు ముందు సుశాంత్ ఏ ఏ నిర్మాణ సంస్థలతో కాంట్రక్ట్‌లు సైన్‌ చేశాడు. తరువాత వాటిలో ఏవైనా క్యాన్సిల్‌ అయ్యాయా..? లాంటి వివరాలను ఆరా తీస్తున్నారు. ఈ నేపథ్యంలో సుశాంత్ ఇటీవల ఓ లీడింగ్ ప్రొడక్షన్ హౌస్‌తో కాంట్రక్ట్ సైన్ చేసినట్టుగా తెలుస్తోంది. అందుకు సంబంధించిన కాపీని కూడా ఇవ్వాల్సిందిగా సదరు నిర్మాణ సంస్థను పోలీసులు ఆదేశించారు.

మరో మూడు నిర్మాణ సంస్థలకు సంబంధించిన ప్రతినిథులను కూడా సుశాంత్ ఆత్మహత్య నేపథ్యంలో విచారించేందుకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సుశాంత్ స్నేహితులు, సన్నిహితులు, పనివారిని ప్రశ్నిస్తున్నారు. తాజాగా ఈ కేసులో భాగంగా సుశాంత్ గర్ల్‌ ఫ్రెండ్‌ రియా చక్రవర్తిని ప్రశ్నించారు. గురువారం ఉదయం 11 గంటల సమయంలో రియా పోలీసులను కలిసి తన స్టేట్‌మెంట్ ఇచ్చింది. ఆమెను దాదాపు 10 గంటల పాటు ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది.

రియాతో పాటు ఆయన బిజినెస్ మేనేజర్‌ శృతి మోడీ, రాధిక నిహ్లాని ఇతర పీఆర్‌ టీంలను కూడా ప్రశ్నిస్తున్నారు. శృతి మోడి గత ఏడాది జూలై నుంచి సుశాంత్‌తో కలిసి పనిచేస్తోంది. ఫిబ్రవరి 3 నుంచి సుశాంత్ దగ్గర పనిచేయటం మానేసినట్టుగా పోలీసులకు వెల్లడించినట్టుగా తెలుస్తోంది. సుశాంత్‌ ది విభిన్న వ్యక్తిత్వం అని శృతి పోలీసులకు తెలిపినట్టుగా తెలుస్తోంది. కొంత కాలంగా వర్చ్యువల్‌ రియాలిటీ గేమింగ్ కపెంనీని వివిడ్‌ రేజ్‌ పేరుతో నెలకొల్పేందుకు ప్లాన్ చేసినట్టుగా శృతి వెల్లడించింది.

విచారణలో భాగంగా సుశాంత్‌కు ఆర్ధికపరమైన ఇబ్బందులేమి లేవని తెలుస్తోందని పోలీసులు వెల్లడించారు. సుశాంత్ నెలకు దాదాపు 10 లక్షల వరకు ఖర్చు చేస్తున్నాడట, కేవలం ఇంటి అద్దెకే 4.5 లక్షలు చెల్లిస్తున్నాడు. అదే సమయంలో పవనా డామ్‌ దగ్గర్లో ఓ ఫాం హౌస్‌ను కూడా రెంట్‌కు తీసుకున్నట్టుగా తెలుస్తోంది. దీంతో ఇతర కోణాలపై కూడా దృష్టిపెట్టారు పోలీసులు. ముఖ్యంగా ఇండస్ట్రీలో నెపోటిజం ఆరోపణల నేపథ్యంలో ఆ దిశగా కూడా విచారణ చేస్తున్నారు.