కొన్ని కాంబినేషన్స్ చాలా క్రేజీగా ఉంటాయి. ఫ్యాన్స్ ఆశగా కోరుకుంటారు. టాలీవుడ్ లో భారీ ఫ్యాన్ బేస్ కలిగిన నందమూరి హీరోలు కలిసి ఓ మల్టీస్టారర్ చేయాలనే డిమాండ్ ఎప్పటి నుండో ఉంది. తాజాగా దీనిపై హీరో కళ్యాణ్ రామ్ స్పందించారు.
బాలకృష్ణ, ఎన్టీఆర్(NTR) కలిసి నటిస్తే చూడాలనేది నందమూరి అభిమానుల కోరిక. అలాగే అక్కినేని హీరోల మనం మాదిరి ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, బాలయ్య ఓ మూవీ చేయాలని కూడా ఫ్యాన్స్ ఆశపడుతున్నారు. ఎన్టీఆర్, బాలయ్య మధ్య విబేధాలు ఉన్నాయని, రాజకీయ కారణాలతో వీరు విడిపోయారనే ఓ వాదన భావన అందరి మదిలో ఉంది. 2009 ఎన్నికల నాటి నుండి ఎన్టీఆర్ నారా, నందమూరి కుటుంబాలకు దూరం కావడం జగమెరిగిన సత్యం. ఈ మధ్య కాలంలో అప్పుడప్పుడు ఎన్టీఆర్, బాలయ్య ఒకే వేదిక పంచుకున్న సందర్భాలు ఉన్నాయి.
అయితే కలిసి మూవీలో నటించే అంత సాన్నిహిత్యం ఉందా? అనేది అసలు ప్రశ్న. ఈ నేపథ్యంలో నందమూరి హీరోలు మల్టీస్టారర్ పై హీరో కళ్యాణ్ రామ్ స్పందించారు. బింబిసార చిత్ర ప్రమోషన్స్ లో పాల్గొంటున్న కళ్యాణ్ రామ్ విలేకరి ప్రశ్నకు సమాధానంగా.. తమ్ముడు ఎన్టీఆర్, బాలయ్య బాబాయ్ తో మల్టీస్టారర్ చేయడానికి సిద్దమే. కాకపోతే మంచి స్క్రిప్ట్ దొరకాలి అన్నారు. ఇటీవల బాలయ్య సైతం ఈ విషయం పై స్పందించారు. ఎన్టీఆర్ తో కలిసి నటించడానికి సిద్దమే, అన్నారు.
మరి టాలీవుడ్ లో ఏ దర్శకుడు ఈ క్రేజీ ప్రాజెక్ట్ తెరపైకి తెస్తాడో చూడాలి. ఇక కళ్యాణ్ రామ్ నటించిన బింబిసార ఆగస్టు 5న విడుదల కానుంది. ఈ క్రమంలో జులై 29న ప్రీ రిలీజ్ వేడుక జరగనుంది. ఈ వేడుకకు ఎన్టీఆర్ గెస్ట్ గా రానున్నారు. క్యాథరిన్ థెరిస్సా హీరోయిన్ గా నటించగా వశిస్ట్ దర్శకత్వం వహించారు. కీరవాణి(Bimbisara) సంగీతం అందించారు.
