ఇండియన్ క్రికెట్ లెజెండ్ ఎంఎస్ ధోని వ్యూహాలు మైదానంలో ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన మాస్టర్ మైండ్ తో ధోని టీం ఇండియాకు అనేక విజయాలు అందించాడు. ఇటీవల ముగిసిన ఐసీసీ క్రికెటర్ వరల్డ్ కప్ తర్వాత ధోని రిటైర్మెంట్ గురించి అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ధోనికి మరికొంత కాలం క్రికెట్ ఆడే సత్తా ఉన్నప్పటికీ అతడి కెరీర్ చివరి దశకు చేరుకుందనే ప్రచారం జరుగుతోంది. 

ఇదిలా ఉండగా ధోని గురించి ఓ ఆసక్తికర విషయం అతడి అభిమానులతో పాటు సినీ వర్గాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది. ముందు చూపుతో వ్యవహరించే ధోని రిటైర్మెంట్ తర్వాత ఏం చేయాలో అప్పుడే నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. 

ధోని చలనచిత్ర రంగంలోకి అడుగుపెట్టబోతున్నాడనేది లేటెస్ట్ టాక్. సొంత నిర్మాణ సంస్థని  సినిమాలు నిర్మించాలని భావిస్తున్నాడట. బాలీవుడ్ లో తన చిరకాల మిత్రుడు జాన్ అబ్రహంతో ధోని ఈ విషయం గురించి ఇప్పటికే చర్చించినట్లు తెలుస్తోంది. 

ఇద్దరూ కలసి సొంతంగా ప్రొడక్షన్ హౌస్ ని ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ధోని జీవితంపై ఇప్పటికే ఎంఎస్ ధోని ది అన్ టోల్డ్ స్టోరీ అనే బయోపిక్ చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే.