మాజీ నటి, ఎంపీ నవనీత్‌ కౌర్‌ ఇటీవల కరోనాకి గురైన విషయం తెలిసిందే. ఆమె ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉంది. అయితే తనకు వైరస్‌ ఎలా సోకిందో వివరించింది
నవనీత్‌ కౌర్‌. ఫేస్‌బుక్‌లో ఆ వివరాలను పంచుకుని అభిమానులు కుదుట పడేలా చేసింది. వారికి ధైర్యాన్నిచ్చింది. 

ఆమె చెబుతూ, నా కుమార్తె, కుమారుడితోపాటు ఇతర కుటుంబ సభ్యులకూ వైరస్‌ సోకింది. ఓ తల్లిగా వారిని జాగ్రత్తగా చూసుకోవడం నా మొదటి కర్తవ్యం. ఈ క్రమంలో నాకూ
వైరస్‌ సోకింది. పాజిటివ్‌ వచ్చినంత మాత్రాన నేను అధైర్య పడలేదు. ధైర్యంగా దాన్ని ఎదుర్కొంటున్నా. నేనే కాదు మా ఫ్యామిలీ కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాం.
అభిమానులెవరూ అధైర్య పడవద్దని తెలిపింది. 

అభిమానుల ఆశీస్సులతో కరోనాని త్వరగానే జయిస్తామని తెలిపింది. ఇంట్లోనే సురక్షితంగా ఉంటూ ప్రభుత్వం సూచించే నిబంధనలు, మార్గదర్శకాలు పాటించాలని విజ్ఞప్తి
చేశారు. ప్రస్తుతం నవనీత్ మహారాష్ట్రలోని అమరావతి నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అంతకు ముందు నటిగా తెలుగు, తమిళ, హిందీ చిత్రాల్లో నటించి
ఆకట్టుకున్న విషయం తెలిసిందే. `శీను వాసంతి లక్ష్మీ`, `జగపతి`, `రూమ్మేట్స్`, `మహారధి`, `యమదొంగ`, `టెర్రర్‌`, `నిర్ణయం`, `కాలచక్రం` వంటి చిత్రాల్లో నటించి తెలుగు
ఆడియెన్స్ ని మెప్పించింది.