టీమ్‌ ఇండియా మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని అంతర్జాతీయ క్రికెట్‌కి రిటైర్‌మెంట్‌ ప్రకటించడంతో అభిమానులు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. అంతేకాదు సెలబ్రిటీలు సైతం ధోనీ రిటైర్‌మెంట్‌పై ఎమోషనల్‌ అవుతున్నారు. తాజాగా టాలీవుడ్‌ హీరోలు ధోనీ సేవలను, ఘనతలను కొనియాడారు. 

ట్విట్టర్‌ ద్వారా మహేష్‌బాబు స్పందిస్తూ, 2011లో ఇండియాను క్రికెట్‌ విశ్వవిజేతగా నిలిపిన ఆ ఐకానిక్‌ సిక్సర్‌ను నేను ఎలా మర్చిపోగలను. నేను ఆ సమయంలో వాంఖేడియం స్టేడియంలోనే నిలుచున్నాను. గర్వంగా ఉంది. కన్నీళ్ళు వస్తున్నాయి. క్రికెట్‌ ఎప్పడూ ఒకేలా ఉండదు. టేక్‌ ఏ బౌ ఎం.ఎస్‌.ధోనీ` అని తెలిపారు. 

మరోవైపు సీనియర్‌ హీరో విక్టరీ వెంకటేష్‌ సైతం ధోన ఘనతను గుర్తు చేసుకున్నారు. `ఎన్నో మెమరీస్‌ని అందించినందుకు ధన్యవాదాలు. మేం మిమ్మల్ని ఫీల్డ్ లో చాలా మిస్‌ అవుతాం` అని ఎమోషనల్‌ ట్వీట్‌ చేశారు. 

యంగ్‌ హీరో అఖిల్‌ సైతం ధోనిని గుర్తు చేసుకున్నారు. `మీరందించిన అద్బుతమైన జ్ఞాపకాలకు ధన్యవాదాలు కెప్టెన్‌. మీ జర్నీ ప్రభావితం చేయడమే కాదు, భారత క్రికెట్‌ని ఉత్తమంగా మార్చింది. వాట్‌ ఏ లెజెండ్‌` అని అఖిల్‌ ట్వీట్‌ ద్వారా ఎమోషనల్‌ అయ్యాడు. మలయాళ సూపర్‌ స్టార్‌ మోహన్‌లాల్‌ సైతం ధోనిని గుర్తు చేసుకుంటూ ఆయనకు మంచి భవిష్యత్‌ ఉండాలని కోరుకున్నారు.