చెన్నై సినీ కళాకారుడు తన భార్యకి సుఖ ప్రసవం కోసం ప్రయత్నించి హాస్పిటల్ కి తీసుకెళ్ళకుండా ఇంట్లోనే ప్రసవం చేయించిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇటీవల యూట్యూబ్ లో చూసి ఇంట్లోనే ప్రసవం చేసుకున్న ఓ మహిళ మరణించిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో ఇంట్లో గర్భిణులకు ప్రసవం చూసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ అటువంటి ఓ సంఘటన తెన్‌కాశిలో చోటుచేసుకుంది. తెన్‌కాశి సమీపం ఇడైకాల్ ప్రాంతానికి చెందిన రమేష్(31) అతనికి జయలక్ష్మి(22) అనే యువతితో వివాహమైంది.

రమేష్ చెన్నైలో సినీ పరిశ్రమలో కళాకారుడిగా ఉన్నారు. అతడి భార్య గర్భిణి అయినప్పటి నుండి ఆసుపత్రికి తీసుకెళ్లకుండా నాటు మందులు, యోగా శిక్షణ ఇచ్చినట్లు  తెలుస్తోంది. నిండు గర్భిణి అయిన తన భార్యని ఇంటికి తీసుకొచ్చి బుధవారం ఉదయం 8:30 గంటలకి సుఖ ప్రసవం జరిగేలా చేశారు.

ఈ విషయం తెలుసుకున్న ఇడైకాల్ ప్రభుత్వ ఆసుపత్రి నర్సులు శిశువుకి బొడ్డు పేగు కత్తిరించాలని జయలక్ష్మి భర్త రమేష్ ని కోరారు. దానికి ఆయన అంగీకరించలేదు. దీంతో మెటర్నటీ హాస్పిటల్ ప్రధాన వైద్య అధికారి, పోలీసులు అక్కడకి చేరుకొని రమేష్ తో మాట్లాడి జయలక్ష్మి, ఆమెకి పుట్టిన ఆడ శిశువుని హాస్పిటల్ కి తరలించారు.