మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఓ జర్నలిస్ట్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఆయన తీరుపై మీడియా వర్గాల్లో విమర్శలు గుప్పించడంతో క్షమాపణలు చెబుతూ ఓ పోస్ట్ పెట్టారు. వివరాల్లోకి వెళితే.. కేరళ వరద బాధితులకు సహాయం చేయడానికి విశ్వశాంతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఓ కార్యక్రమానికి మోహన్ లాల్ హాజరయ్యారు.

తన తల్లితండ్రుల పేరిట మోహన్ లాల్ ఈ ఫౌండేషన్ ని నిర్వహిస్తున్నారు. అయితే ఈ కార్యక్రమానికి హాజరైన ఓ జర్నలిస్ట్ క్రెస్తవ నన్ పై జరిగిన అత్యాచారం గురించి స్పందించమని మోహన్ లాల్ ని అడగగా.. ఇలాంటి సమయంలో అలాంటి ప్రశ్నలు అడగడానికి సిగ్గుగా లేదు..? అంటూ సదరు జర్నలిస్ట్ పై విరుచుకుపడ్డారు.

ఆయన ప్రవర్తనపై ఇప్పుడు సోషల్ మీడియాలో విమర్శల వర్షం కురిపిస్తున్నారు. దీంతో మోహన్ లాల్ ఆ జర్నలిస్ట్ కి క్షమాపణ చెబుతూ ఓ పోస్ట్ పెట్టారు. ''నా సమాధానం మిమ్మల్ని బాధ పెట్టి ఉంటే నన్ను మీ పెద్ద అన్నగా భావించి క్షమాపణలు స్వీకరించండి.

ఒక వ్యక్తిని కానీ, సంస్థని కానీ తక్కువ చేయాలని నేను ఆ వ్యాఖ్యలు చేయలేదు. వరద బాధితుల సహాయక చర్యల గురించి నేను మీడియాతో మాట్లాడుతున్న సమయంలో దానికి సంబంధం లేని ప్రశ్న ఎదురుకావడంతో నేను అలా స్పందించాను. మీరు అడిగిన ప్రశ్న ప్రస్తుతం చర్చించాల్సిన అంశమే కానీ ఆ సమయంలో నేను సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా లేను'' అంటూ వెల్లడించారు. 

ఇది కూడా చదవండి.. 

సిగ్గుగా లేదా..? జర్నలిస్ట్ పై సూపర్ స్టార్ ఆగ్రహం!