హీరో రాజశేఖర్‌ త్వరగా కోలుకోవాలని చిత్ర పరిశ్రమ పెద్దలు కోరుకుంటున్నారు. చిరంజీవి ఇప్పటికే రాజశేఖర్‌ ఫ్యామిలీకి, వారి అభిమానులకు ధైర్యాన్ని నూరిపోశారు. తాము అండగా ఉంటామన్నారు. స్నేహితుడిగా, కోస్టార్‌గా వారికి మద్దతుగా నిలిచారు. తాజాగా మోహన్‌బాబు స్పందించారు. రాజశేఖర్‌ త్వరగా కోలుకోవాలన్నారు.  

ట్విట్టర్‌ ద్వారా విలక్షణ నటుడు మోహన్‌బాబు స్పందిస్తూ, నా సహచరుడు, ప్రియమైన స్నేహితుడు రాజశేఖర్‌, జీవిత త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా. సాయిబాబా దయతో వారు త్వరగా కోలుకుంటారని, కచ్చితంగా సినిమా షూటింగుల్లో పాల్గొంటారని ఆశిస్తున్నా` అని ట్వీట్‌ చేశారు. 

రాజశేఖర్‌ ఫ్యామిలీ ఇటీవల కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ఫ్యామిలీ మొత్తానికి కరోనా వచ్చింది. కానీ రాజశేఖర్‌ ఆరోగ్యం ఆందోళనకరంగా ఉందని ఈ రోజు ఉదయం రాజశేఖర్‌ కూతురు శివాత్మిక ట్వీట్‌ చేశారు. దీంతో అందరిలోనూ ఆందోళన నెలకొంది. ఆ తర్వాత జీవిత  స్పందిస్తూ, రాజశేఖర్‌ ఆరోగ్యం నిలకడగా ఉందని, ట్రీట్‌మెంట్‌కి స్పందిస్తున్నారని తెలిపారు. ఐసీయూలో రాజశేఖర్‌ కి ట్రీట్‌మెంట్‌ అందిస్తున్నట్టు సిటీ న్యూరో సెంటర్‌ వెల్లడించింది.