శనివారం మెగా అభిమానులు రెండు పండుగలు చేసుకుంటున్నారు. ప్రపంచంతో కలిసి వినాయక చవితితో పాటు తమ అభిమాన కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజును కూడా పండుగలా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా అభిమనులు, సినీ ప్రముఖులు కుటుంబ సభ్యులు మెగాస్టార్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో మోహన్‌ బాబు కూడా చిరంజీవికి శుభాకాంక్షలు తెలిపాడు.

అందరు చెప్పే విషెస్‌ కన్నా మోహన్‌ బాబు చెప్పిన విషెస్‌ ప్రత్యేకం. ఎందుకంటే చిరు, మోహన్ బాబుల మధ్య ఎప్పుడూ క్యాట్ అండ్‌ మౌస్‌ వార్‌ జరుగుతూనే ఉంటుంది. పలు వేదికల మీద బహిరంగంగానే విమర్శించుకున్న మోహన్ బాబు, చిరులు వెంటనే కలిసిపోతుంటారు. దీంతో మోహన్‌ బాబు, చిరుకు ఎలా విషెస్‌ చెబుతాడా.. అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

`చిరంజీవి నాకు మంచి మిత్రుడు, అతని పేరులోనే ఉంది చిరంజీవి అంటే ఆంజనేయస్వామి. అంటే ఎల్లకాలము చిరంజీవివై వర్ధిల్లుగాక. అంటే నిండు నూరేళ్ళు ఉత్సాహంగా కుటుంబ సభ్యులతో పుట్టినరోజు జరుపుకోవాలని ఆ షిరిడీ సాయినాథున్ని కోరుకుంటున్నాను. బెస్ట్  ఆఫ్ లక్ మై డియర్ ఫ్రెండ్` అంటూ ట్వీట్ చేశాడు మోహన్‌ బాబు. ఈ ఫోటోతో పాటు చిరుతో కలిసి దిగిన ఫోటోను షేర్ చేశాడు కలెక్షన్‌ కింగ్.