మెగాస్టార్ చిరంజీవి నేడు తన పుట్టినరోజు వేడుకను ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ పుట్టినరోజుతో చిరు 65వ ఏట అడుగుపెడుతుండగా, ఆయనకు ఇది చాలా ప్రత్యేకం అనాలి. సోషల్ మీడియాలో చిరు బర్త్ డేని ఫ్యాన్స్ సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. అలాగే వారి కోసం చిరు లేటెస్ట్ మూవీ ఆచార్య  ఫస్ట్ లుక్ అండ్ మోషన్ పోస్టర్ విడుదల అయ్యాయి. ధర్మ స్థలి అనే ఓ పురాతన ఆర్చ్ ముందు కత్తితో శత్రువులను వెంటాడుతున్న చిరంజీవి లుక్ కేకగా ఉంది. ఇక ఆయన మెడలో ఎర్ర కండువా విప్లవభావాలు కలిగిన వాడిగా ప్రొజెక్ట్ చేస్తుంది. మొత్తంగా మోషన్ పోస్టర్ తోనే చిరు మూవీపై హైప్ పెంచేశారు. 

ఇక నేటి ఉదయం నుండి సోషల్ మీడియాలో చిరంజీవికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఫ్యాన్స్ తో పాటు, సినీ మరియు రాజకీయ ప్రముఖులు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాగా ఈ లిస్ట్ లో నటి మరియు వైసీపీ ఎమ్మెల్యే రోజా కూడా చేరారు. ఆమె సోషల్ మీడియాలో చిరంజీవికి తనదైన శైలిలో శుభాకాంక్షలు తెలిపారు. ''స్వయంకృషితో మెగాస్టార్ గా ఎదిగి ఎందరో నటులకు ఆదర్శంగా నిలిచిన మా చిరుగారికి జన్మదిన శుభాకాంక్షలు'' అని రోజా ట్వీట్ చేశారు. 

ఇక 1990లలో చిరంజీవి మరియు రోజా కలిసి నటించడం జరిగింది. బిగ్ బాస్, ముఠామేస్త్రీ, ముగ్గురు మొనగాళ్లు వంటి చిత్రాలలో  వీరు కలిసి నటించారు. ముగ్గురు మొనగాళ్లు, ముఠామేస్త్రీ భారీ విజయాలు అందుకున్నాయి. చిరు స్టెప్స్ కి సరైన పోటీ ఇచ్చిన హీరోయిన్స్ లో రోజా కూడా ఉన్నారు. స్క్రీన్ పై వీరిద్దరి గ్రేస్ సూపర్ గా ఉండేది.