ప్రేమ్ రాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన శరణం గచ్చామి మూవీ విడుదలకు ముందే సెన్సార్ క్లియరెన్స్ వివాదం రిలీజ్ అయాక మిక్స్ డ్ రెస్పాన్స్ నిర్మాత- బొమ్మకు మురళి ఏసియానెట్ రేటింగ్- 2.5/5
కథ :
మానవ్ (నవీన్ సంజయ్) అనే కుర్రాడు జర్నలిజం చదువుతూ సమాజంలో ఉన్న కుల పిచ్చి, నిరుద్యోగం, దోపిడి వంటి సమస్యలపై తనదైన దూకుడు శైలిలో స్పందిస్తూ తన పీజీ రీసెర్చ్ కోసం ఆ కులం, రిజర్వేషన్ టాపిక్స్ నే ఎంచుకుని పరిశోధన మొదలుపెడతాడు.
అలా రీసెర్చ్ చేస్తున్న అతనికి ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి ? వాటిని ఎలా ఎదుర్కున్నాడు ? పరిశోధనలో అతను తెలుసుకున్న నిజాలేమిటి ? ఆ పరిశోధన ద్వారా రిజర్వేషన్ తాలూకు సమస్యలకు అతను ఎలాంటి పరిష్కారం ఇచ్చాడు ? అనేదే తెరపై నడిచే కథ..
ప్లస్ పాయింట్స్ :
రిజర్వేషన్ సిస్టం, అందులోని లోటుపాట్లు, అవి ఎలా పని చేయాలి అని చెప్పడమే ఈ సినిమాలో మెప్పించే ప్రధాన అంశాలు. సినిమా సెకండాఫ్లో మన దేశంలో కుల వ్యవస్థ మనుషుల మధ్య ఎలాంటి అంతరాలను సృష్టించింది, వేల ఎళ్ళనాటి వర్ణ వ్యవస్థ ఇప్పటికీ మనల్ని ఎలా బాధిస్తోంది అనే అంశాలను కాస్త బలంగానే ఎక్స్పోజ్ చేశారు. అలాగే అంబేడ్కర్ తయారు చేసిన రాఃజ్యాంగంలోని రిజర్వేషన్ సిస్టమ్ పట్ల ప్రజల్లో ఎలాంటి భిన్నాభిప్రాయాలున్నాయి అనేది చూపుతూనే దానికి పరిష్కారం చూపే ప్రయత్నం బాగుంది.
మైనస్ పాయింట్స్ :
సినిమాలోని ప్రధాన మైనస్ పాయింట్ అంటే కీలకమైన కథాంశం చుటూ అల్లుకున్న ఇతర కథనం అనే చెప్పాలి. ఫస్టాఫ్ మొత్తాన్ని హీరో క్యారెక్టరైజేషన్ కోసం ఇష్టమొచ్చినట్టు వాడుకోవడం వలన ఆ భాగమంతా పరమ బోరింగా తయారైంది. కథనం ఎక్కడా ఆకట్టుకునే విధంగా లేకపోవడంతో విసుగెత్తింది. ఇక ఆ భాగాల్లో హీరో ఫ్రెండ్స్ బ్యాచ్, హీరో ఫ్యామిలీ మీద నడిచే సన్నివేశాలైతే చికాకు తెప్పించాయి. రిజర్వేషన్ సిస్టమ్ అనే బలమైన, సమస్యాత్మక అంశాన్ని ప్రభావితంగా చెప్పాలనుకున్నప్పుడు నటీ నటుల పెర్ఫార్మెన్స్ చాలా ముఖ్యం. కానీ ఈ సినిమాలో అదే లోపించింది.
సాంకేతిక విభాగం :
రచయిత మురళి బొమ్మకు మంచి అంశాన్నే ఎంచుకున్నాడు గానీ దాని చుట్టూ ఒక పూర్తి స్థాయి సినిమాకు కావాల్సిన కథానాన్ని అల్లుకోవడంలో చాలా వరకు విఫలమయ్యాడు. ఇక దర్శకుడు ప్రేమ్ రాజ్ సెకండాఫ్ టేకింగ్ ను పర్వాలేదనిపించినా ఫస్టాఫ్ అంతటినీ ఏమాత్రం ఆకట్టుకునే విధంగా లేకుండా నడిపాడు.
తీర్పు:
రిజర్వేషన్ అనే హాట్ టాపిక్ ఆధారంగా రూపొందిన ఈ సినిమాలో అసలు రిజర్వేషన్ ఎందుకు, ప్రస్తుతం దాని పరిస్థితి ఎలా ఉంది, అది ఎలా దుర్వినియగం అవుతోంది, అన్ని సమస్యలకు రాజ్యాంగమే పరిష్కారం ఎలా అవుతుంది అనే అంశాలను కాస్త వివరంగానే చెప్పినప్పటికీ విసుగెత్తించే ఫస్టాఫ్, ఏమాత్రం ఆకట్టుకోని హీరో లవ్ ట్రాక్, సినిమాకు పెద్దగా ఉపయోగపడలేకపోయిన నటీనటుల నటన, బలవంతంగా ఇరికించినట్టు ఉండే కొన్ని సన్నివేశాలు బలహీనతలుగా మారి ఈ సినిమా ఫలితాన్ని దెబ్బతీశాయి.
రేటింగ్ 2.5 5
ఫైనల్ లైన్ - లైన్ బాగుంది...పెర్‌ఫార్మెన్స్ దెబ్బకొట్టింది
