జులై 2న అరుదైన దృశ్యం చోటు చేసుకోబోతోంది. ముగ్గురు మహిళా సెలెబ్రిటీలు ఒకే వేదికపై కనిపించనున్నారు. వివరాల్లోకి వెళితే.. విలక్షణ నటనతో సాహసోపేతమైన పాత్రల్లో నటిస్తున్న ఐశ్వర్య రాజేష్ నుంచి మరో క్రేజీ మూవీ వస్తోంది. ఐశ్వర్య రాజేష్ నటించిన 'కౌసల్య కృష్ణమూర్తి' చిత్రం త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది. 

ఈ సందర్భంగా జులై 2న హైదరాబాద్ లో ఈ చిత్ర ప్రీరిలీజ్ వేడుకని ఘనంగా నిర్వహించబోతున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మహిళా స్టార్ క్రికెటర్ మిథాలీ రాజ్, హీరోయిన్ రాశి ఖన్నా ముఖ్య అతిథులుగా హాజరు కాబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. 

మిథాలీ రాజ్ తొలి సరి సినిమా ఈవెంట్ కు రానుండడంతో ఆసక్తి నెలకొంది. కౌశల్య కృష్ణమూర్తి చిత్రం క్రికెట్ నేపథ్యంలో సాగుతుంది. ఓ పల్లెటూరి అమ్మాయి చిన్ననాటి నుంచే క్రికెటర్ కావాలనే లక్ష్యంతో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంది అనేదే ఈ చిత్ర కథ. దీనితో మిథాలీ రాజ్ ని అతిథిగా ఆహ్వానించారు. ఐశ్వర్య రాజేష్ తండ్రిగా రాజేంద్ర ప్రసాద్ నటించారు. బీమినేని శ్రీనివాస రావు ఈ చిత్రానికి దర్శకుడు.