'అర్జున్ రెడ్డి' చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు రాహుల్ రామకృష్ణ ఆ తరువాత టాలీవుడ్ లో మంచి అవకాశాలు అందిపుచ్చుకొని బిజీ ఆర్టిస్ట్ గా మారాడు. గతేడాది రాహుల్, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో 'మిఠాయి' అనే డార్క్ కామెడీ సినిమాలో నటించారు. పోస్టర్లు, టీజర్ లతో ప్రేక్షకుల్లో ఆసక్తి క్రియేట్ చేసినప్పటికీ సినిమా అనుకున్నంత స్థాయిలో లేకపోవడంతో బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయింది.

అయితే దానంతటికీ కారణం రాహుల్ అని అంటున్నాడు చిత్ర దర్శకుడు ప్రశాంత్ కుమార్. 'మిఠాయి' సినిమా తన డ్రీం ప్రాజెక్ట్ అని చెప్పిన ఈ దర్శకుడు రాహుల్ ని ఉద్దేశిస్తూ సోషల్ మీడియాలో పెద్ద పోస్ట్ పెట్టాడు. ఈ పోస్ట్ కి 'రాహుల్ రామకృష్ణతో చేదు మిఠాయి'  అనే టైటిల్ కూడా పెట్టాడు. రాహుల్ కారణంగానే సినిమా మొదలుపెట్టానని చెప్పిన ఈ దర్శకుడు సినిమా షూటింగ్ మొదలుపెట్టిన తరువాత రాహుల్ తనను ఎలా ఇబ్బంది పెట్టాడో స్పష్టంగా రాసుకొచ్చాడు.

డేట్స్ ఇవ్వకుండా చాలా సన్నివేశాలు, పాటలను తూతూ మంత్రంగా కానిచ్చేసి తన డ్రీం ప్రాజెక్ట్ ని నాశనం చేశాడని వాపోయాడు. రాహుల్ తనకు మంచి స్నేహితుడని, తనకు సంబంధించిన అన్ని విషయాలు తెలుసని చెప్పిన ప్రశాంత్.. అతడి కారణంగా నరకం అనుభవించానని చెప్పాడు. ఆర్థికంగా కూడా తనను ఎంతో ఇబ్బంది పెట్టాడని చెప్పారు. పదిరోజులు షూటింగ్ లో తన ఖర్చులను 70 వేల రూపాయల బిల్ ఇచ్చాడని.. అందరూ ప్రొడక్షన్ ఫుడ్ తింటే రాహుల్ మాత్రం అలా చేసేవాడు కాదని వాపోయాడు.

'భరత్ అనే నేను' సినిమాలో రాహుల్ నటన చూసి భయపడిన మహేష్ బాబు తన పోర్షన్ ఎడిట్ చేయించాడని రాహుల్ చెప్పుకొని తిరుగుతుంటాడని సంచలన కామెంట్స్ చేశారు. ఎదుటివారిపై ఎప్పుడూ ఏదొక కామెంట్ చేస్తుంటే ఉంటాడని అన్నారు. అతను మంచి మనిషిగా మారాలని తను మనస్పూర్తిగా కోరుకుంటున్నానని చెప్పాడు ప్రశాంత్. రాహుల్ కారణంగా తనలా ఏ నిర్మాత, దర్శకుడు బాధపడకూడదని రాసుకొచ్చాడు.