సారాంశం
స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు తన డ్రీమ్ ని నిజం చేసుకున్నారు. హైదరాబాదులో ఏఐ స్టూడియోని ప్రారంభించారు. ఇటీవల దిల్ రాజు తన ఏఐ స్టూడియో గురించి ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.
స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు తన డ్రీమ్ ని నిజం చేసుకున్నారు. హైదరాబాదులో ఏఐ స్టూడియోని ప్రారంభించారు. ఇటీవల దిల్ రాజు తన ఏఐ స్టూడియో గురించి ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. దిల్ రాజు లార్వెన్ ఏఐ స్టూడియోను మంత్రి శ్రీధర్ బాబు తన చేతుల మీదుగా ప్రారంభించారు. టాలీవుడ్ ప్రముఖ దర్శకులంతా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, సుకుమార్, వంశీ పైడిపల్లి, వివి వినాయక్, డైరెక్టర్ బాబి, అనిల్ రావిపూడి లాంటి ప్రముఖ దర్శకులంతా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. లార్వెన్ ఏఐ స్టూడియో ప్రారంభించిన తర్వాత మంత్రి శ్రీధర్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టెక్నాలజీ విషయంలో మనం లీడర్స్ అని ప్రపంచవ్యాప్తంగా మరోసారి రుజువు అయింది. లార్వెన్ ఏఐ స్టూడియో హైదరాబాద్ కి మరింత గుర్తింపు తీసుకువస్తుందని భావిస్తున్నా.
దిల్ రాజ్ తో నాకు చాలా ఏళ్ల నుంచి పరిచయం ఉంది. దిల్ రాజు అనుకున్నది సాధించి తీరుతారు. సినిమా రంగానికి టెక్నాలజీ జోడించాలని ఆయన దృఢ సంకల్పంతో ఉన్నారు. అందుకే ఈ స్టూడియో ప్రారంభించారు. ఇకపై సినిమా రంగానికి చెందిన అన్ని పనులు ఏఐ ద్వారా సులభంగా పూర్తవుతాయి. ఇప్పటికే చాలా చిత్రాల్లో ఏఐ ని ఉపయోగిస్తున్నారు అని శ్రీధర్ బాబు అన్నారు.
నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ రెండేళ్ల క్రితమే ఈ స్టూడియో ని ప్రారంభించాలనే ఆలోచన వచ్చింది. అప్పటి నుంచి సినిమా రంగానికి ఏఐ ఎంతలా ఉపయోగపడుతుంది అనే విషయాన్ని లోతుగా చర్చిస్తూ వచ్చాం. ఇకపై సినిమా నిర్మాణంలో కీలక పాత్ర ఏఐ దే అని దిల్ రాజు అన్నారు. స్క్రిప్ట్ మాత్రమే తయారు చేసుకుంటే చాలు. సౌండ్ మిక్సింగ్, విజువల్స్ ఇలా అన్ని పనులు పూర్తి చేసుకుని సినిమా చూసెయ్యొచ్చు అని దిల్ రాజు తెలిపారు.