సారాంశం

లియో చిత్రంలో నటుడు మన్సూర్ అలీ ఖాన్ కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. తాజాగా నటి, మంత్రి రోజా మన్సూర్ పై విరుచుకుపడ్డారు.

లోకేష్ కనకరాజ్, దళపతి విజయ్ కాంబినేషన్ లో తెరకెక్కిన లియో చిత్రం కొన్ని వారాల క్రితం విడుదలై పర్వాలేదనిపించింది. టాక్ ఎలా ఉన్నా ఈ చిత్రానికి మంచి వసూళ్లు వచ్చాయి. ఈ చిత్రంలో విజయ్ సరసన త్రిష నటించింది. ఇద్దరూ భార్య భర్తలుగా అద్భుతంగా నటించి మెప్పించారు. 

లియో చిత్రంలో నటుడు మన్సూర్ అలీ ఖాన్ కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఆంటోని దాస్ గ్యాంగ్ లో కీలక వ్యక్తిగా.. లియోకి అనుచరుడిగా మన్సూర్ నటించారు. తాజాగా మన్సూర్ అలీ ఖాన్ త్రిషని ఉద్దేశించి తీవ్ర అసభ్యంగా వ్యాఖ్యలు చేయడం దుమారం రేపుతోంది. 

లియో చిత్రంలో త్రిషని రేప్ చేసే అవకాశం రాలేదు అంటూ నిరాశ పడుతున్నట్లు వ్యాఖ్యలు చేశాడు. త్రిష ఈ చిత్రంలో నటిస్తుంది అని చెప్పినప్పుడు ఆమెతో బెడ్ రూమ్ లో రేప్ సీన్ ఉంటుందని భావించా. చాలా చిత్రాల్లో నేను రేప్ సన్నివేశాల్లో నటించా. నాకేమి కొత్త కాదు. త్రిషని నా చేతులతో బెడ్ రూమ్ లోకి ఎత్తుకెళ్లే సీన్ ఉంటుందని అనుకున్నా. కానీ ఈ చిత్రంలో నాకు త్రిషతో అసలు సన్నివేశాలే లేవు అంటూ వెకిలి నవ్వుతో కామెంట్స్ చేశాడు. 

దీనిపై పెను దుమారం మొదలైంది. మహిళా సెలెబ్రిటీలు ఒక్కొక్కరుగా మన్సూర్ వ్యాఖ్యలని తీవ్రంగా ఖండిస్తున్నారు. తాజాగా నటి, మంత్రి రోజా మన్సూర్ పై విరుచుకుపడ్డారు. ఆడవాళ్ళ గురించి అసభ్యంగా మాట్లాడే మగాళ్లపై కేసులు పెట్టాయి. చట్ట పరంగా తీవ్ర చర్యలు తీసుకుని ఖఠినమైన శిక్ష విధించాలి. లేకుంటే ఈ మగాళ్లు భయపడరు. 

నాపై దాడి చేసిన టీడీపీ ఎమ్మెల్యే కావచ్చు, త్రిష, ఖుష్బూ పై కామెంట్స్ చేసిన మన్సూర్ కావచ్చు ఎవరైనా సరే కఠినమైన శిక్షలు ఉండాలి. ఈ విధంగా మమ్మల్ని ఎంత టార్గెట్ చేసినా రాజకీయాల్లో సినిమాల్లో ఎదిగి చూపించాం. సామాన్య మహిళలని ఇలాంటి మగాళ్లు కలిస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోలేం అంటూ రోజా హాట్ కామెంట్స్ చేశారు. ఈ వివాదం ఇంకెత దూరం వెళుతుందో చూడాలి.