గత మూడు రోజులుగా స్టార్‌ హీరోయిన్‌ తాప్సీ, దర్శక, నిర్మాత అనురాగ్‌ కశ్యప్‌, ఆయన స్థాపించిన ఫాంటమ్‌ ఫిల్మ్స్ సంస్థ, దాని పార్టనర్స్ పై ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. వారి ఇళ్లు, ఆఫీస్‌లపై ఈ దాడులు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఇది బాలీవుడ్‌లోనే కాదు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. వీరు రైతు చట్టాలపై స్పందించినందుకు ఐటీ దాడులు జరుగుతున్నాయనేది ప్రధాన చర్చగా నడుస్తుంది. 

దీనిపై తాజాగా జాతీయ మీడియాతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ స్పందించారు. వారిపై ఈ దాడులు 2013 నుంచి జరుగుతున్నాయని, అప్పుడు ఇష్యూ కాలేదని, ఇప్పుడెందుకు వివాదం చేస్తున్నారని ఆమె ప్రశ్నించారు. `నేను మొదట ఏ, బి అనే వ్యక్తులపై వ్యాఖ్యానించడం లేదు. కానీ ఆ పేర్లు గల వారిపై 2013 నుంచి ఐటీ దాడులు జరుగుతున్నాయి. ఇది అప్పుడు సమస్య కాలేదు. ఇప్పుడు సమస్య అయ్యింది` అని ఆమె చెప్పారు. 

అయితే 2013 లో జరిగిన ఐటీదాడులపై స్పందించేందుకు నిరాకరించిన ఆమె, `ఈ కపటత్వానికి సమాధానం ఇవ్వండి. ఈ దాడులు ఎప్పటి నుంచి జరుగుతున్నాయో ఓ సారి వెనక్కితిరిగి చూసుకోండి. ఇది జాతీయ ప్రయోజనంలో భాగమని, ఎగవేత జరుగుతుందో, లేదో తెలుసుకోవాలనుకుంటున్నట్టు` నిర్మలా సీతారామన్‌ చెప్పారు. 

తాప్సీ, అనురాగ్‌ కశ్యప్‌, ఫాంటమ్‌ ఫిల్మ్స్‌, దాని పార్ట్‌నర్స్ పై ఏకకాలంలో ముంబయి, పుణె, ఢిల్లీ, హైదరాబాద్‌ వంటి ప్రాంతాల్లో దాదాపు 28 చోట్లు సోదాలు నిర్వహించినట్టు తెలుస్తుంది. ఇందులో పలుకీలక ఆధారాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారట. తమ శోధనలో అసలు బాక్సాఫీసు కలెక్షన్లతో పోల్చితే ప్రముఖ ఫిల్మ్ ప్రొడక్షన్‌ హౌజ్‌ ఆదాయాన్ని భారీగా తగ్గించినట్టు చూపించారని ఆధారాలు బయటపడ్డాయి. కంపెనీ అధికారులు రూ.  300కోట్ల వ్యత్యాసాన్ని వివరించలేకపోయారని ఐటీ అధికారులు తెలిపారు.

`దర్శకుడు, వారి వాటాదారులలో ప్రొడక్షన్‌ మౌజ్‌ వాటా లావాదేవీలు తారుమారు, తక్కువ విలువలకు సంబంధించిన సాక్ష్యాలు సుమారు రూ. 350కోట్లకి సంబంధించిన పన్ను చిక్కులు ఉన్నట్టు తేలింది. దీనిపై దర్యాప్తు జరుగుతుంది. ప్రస్తుతం ఐదు కోట్ల విలువైన నగదు రశీదులు స్వాధీనం చేసుకున్నామ`ని అధికారులు వెల్లడించారు. దీనిపై పూర్తి స్థాయిలో, అనేక కోణాల్లో దర్యాప్తు జరుగుతుందన్నారు. 

అనురాగ్‌ కశ్యప్‌, మధుమంతెన, వికాస్‌ భల్‌ కలిసి 2011లో ఫాంటమ్‌ ఫిల్మ్స్ ని స్థాపించారు. దీనిపై `లూటెరా`, `క్వీన్‌`,`అగ్లీ`,  `ఎన్‌హెచ్‌ 10`, `మసాన్‌`, `ఉడ్తా పంజాబ్‌` వంటి సూపర్‌ హిట్‌ చిత్రాలను నిర్మించారు. 2018లో వీరి మధ్య తలెత్తిన భేదాభిప్రాయాలతో ఈ సంస్థని క్లోజ్‌ చేశారు. ఆ తర్వాత అనురాగ్‌ కశ్యప్‌ కొత్తగా గుడ్‌ బాడ్‌ ఫిల్మ్స్ అనే సంస్థని స్థాపించి దానిపై సినిమాలు తీస్తున్నారు.

ఇదిలా ఉంటే ఈ దాడులపై తాప్సీ ప్రియుడు మాథియాస్‌ బో ఆవేదన వ్యక్తం చేశారు. తన ఆవేదన కేంద్ర క్రీడా మంత్రి కిరణ్‌ రిజిజుకు ట్విట్టర్‌ ద్వారా తెలిపారు. `నాలో కొంచెం గందరగోళాన్ని కనుగొన్నాను. కొంత మంది గొప్ప అథ్లెట్లకి కోచ్‌గా ఇండియన్‌ క్రీడాకారులకు ప్రాతినిధ్యం వహిస్తున్నా. తాప్సీ ఇంటిపై ఐటీ దాడులు జరగడంతో వారి కుటుంబంలో అనవసరమైన ఒత్తిడి నెలకొంది. దీనిపై ఏదైనా చేయండి ప్లీజ్‌` అంటూ కేంద్రమంత్రికి ట్వీట్‌ చేశారు తాప్సీ ఫ్రెండ్‌. దీనిపై కేంద్ర క్రీడా మంత్రి కిరణ్‌ రిజిజు ప్రతిస్పందించారు. `ఈ భూమిపై చట్టం అత్యున్నతమైనది. మేం దానికి కట్టుబడి ఉండాలి. ఈ విషయం మీ, నా పరిధి మించినది. భారతీయ క్రీడల ప్రయోజనార్థం మేం మావృతి పరమైన విధులకు కచ్చితంగా కట్టుబడి ఉండాలి` అని ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్లు మరింతగా హాట్‌ టాపిక్‌గా మారాయి.