వరుణ్‌ తేజ్‌, రాశి ఖన్నా జంటగా రచయిత వెంకీ అట్లూరి దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘తొలిప్రేమ’. శనివారం విడుదలకాగా రాత్రి ఈ సినిమాను తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ వీక్షించారు. సినిమా బాగుందంటూ ట్విటర్‌ ద్వారా చిత్రబృందంపై ప్రశంసలు కురిపించారు.

 

‘శనివారం రాత్రి సరదాగా గడిచిపోయింది. ‘తొలిప్రేమ’ సినిమా చూశాను. చాలా కాలం తరువాత తెలుగులో ఓ చక్కటి ప్రేమకథా చిత్రం చూశాను. దర్శకుడు వెంకీ అట్లూరి సినిమాను చాలా బాగా తెరకెక్కించారు. పాటలు, నేపథ్య సంగీతం బాగున్నాయి. వరుణ్‌ తేజ్‌, రాశి ఖన్నా చాలా బాగా నటించారు’ అంటూ కేటీఆర్‌ ట్విటర్‌ వేదికగా ప్రశంసలు కురిపించారు.

 

కేటీఆర్‌ ట్వీట్‌పై రాశి ఖన్నా స్పందించారు. ‘మీకు సినిమా నచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలు సర్‌’ అని ట్వీట్‌ చేశారు. గతంలోనూ కేటీఆర్‌ ‘అర్జున్‌ రెడ్డి’, ‘ఫిదా’ తదితర చిత్రాలను చూసి చాలా బాగున్నాయంటూ ప్రశంసించారు.