స్వయంకృషికి నిలువెత్తు నిదర్శనం.. మెగాస్టార్ పుట్టిన రోజు నేడు

megastar chiranjivi birthday today
Highlights

  • ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎలా స్వయంకృషితో పైకి వ‌చ్చిన వ్య‌క్తి మెగాస్టార్ 
  • 1978లో పునాదిరాళ్లు సినిమాతో మొదలైన సినిమా ప్రస్థానం ఖైది నంబర్ 150 తర్వాతా కొనసాగుతూనే ఉంది
  • ఎన్.టి .ఆర్, ఏ.ఎన్.ఆర్ ల  శకం ముగిశాక తెలుగు చిత్ర సీమను ఒక ఊపు ఊపిన మెగాస్టార్ 

హీరోఇజం ఇంట్లో పెట్టుకున్న స్టార్ ఆయన. పొగరు ఒంట్లో పెట్టుకున్న పౌరుషం ఆయన. విలన్లను రఫ్పాడించినా... హీరోయిన్స్ తో డాన్స్ ఆడినా... అభిమానులను ఉర్రూతలూగించిన మాస్ హీరో. మరే హీరోకు లేనంత ఫ్యాన్ పాలోయింగ్ ఆయన సొంతం. తెలుగు ప్రేక్షకుల నీరాజనాలందుకున్న, అందుకుంటున్న గ్యాంగ్ లీడర్ మెగా స్టార్ చిరంజీవి. ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్వయంకృషితో పైకి ఎదిగి అశేష జనాదరణ కలిగిన హీరోగా.. తెలుగు సినిమా హీరోల్లో ఇంతలా అభిమాన గణాన్ని సంపాదించుకున్న ఏకైక హీరో ఆయన. ఆయనే కొణిదెల శివశంకర వర ప్రసాద్ అలియాస్ మెగాస్టార్ చిరంజీవి. 1978లో పునాదిరాళ్లు సినిమాతో మొదలైన సినిమా ప్రస్థానం ఖైది నంబర్ 150 దాకా కొనసాగుతూనే ఉంది.  


చిరంజీవిని సినీ రంగం లో శక పురుషుడు అనవచ్చు. ఎన్ టి ఆర్, ఏ ఎన్ ఆర్ ల తరవాత తెలుగు చిత్ర జగత్తును ఒక ఊపు ఊపాడు సూపర్ స్టార్ కృష్ణ. ఇక ఆ తరవాత నవశకానికి తన దైన శైలిలో డాన్సులతో హోరెత్తించిన చిరంజీవి ఒక సినీ సంచలనం. ఎనిమిది తొమ్మిది దశకాల్లో రెండువేల సంవత్సరం తొలి దశకానికి  - సినిమా రంగానికే ఒక దిక్సూచిగా మారాదు. "నేనాడిందె ఆట నేపాడిందే పాట" అనేలా సాగింది ఆయన నృత్యాల వెల్లువ. ఆ నృత్యాలను చూస్తూ కాలుకలపని యువకులే ఉండరు.


 
ముసలిని కూడా యువకునిగా మార్చిన చిరంజీవి నృత్యం, నటన రసరమ్యం.  ఒక తరాన్ని ఉత్సాహపరచి, ఉల్లాసపరచి, ఉత్తేజితం చేయటమంటే ఒక "వ్యక్తి వ్యవస్థ"గా ఎదగటమే.   చిరంజీవి సినిమాలకు యువత మూడు దశాబ్ధాలు అలవి మాలిన ఆనందంతో డాన్సులు, హాస్యం, ఫైట్స్  కోసం పరుగెత్తిందంటే అందులో ఆయన చూపిన వైవిధ్యం మాత్రమే కారణం అని చెప్పొచ్చు.ఇంత వైవిధ్యం చూపాలంటే దానికి ఆయన చేసిన "హోం వర్క్" ఎంతో ఊహించటం అనితరసాధ్యం. ఆయన నటన లోని పరిణితి గమనించిన  ప్రముఖ దర్శకుడు బహుముఖ ప్రఙ్జాశాలి బాలచందర్ “చిరంజీవిలో కమల్ హసన్ రజనీకాంత్” దాగున్నారని అంటారు. చెన్నై ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుండి డిప్లొమా పొందిన తర్వాత 1978 లో "పునాది రాళ్లు' చిరంజీవి నటించిన తొలి సినిమా. 

 

కాని "ప్రాణం ఖరీదు" విడుదలైన తొలి సినిమా. మొదటిసారి నిర్మాత జయకృష్ణ ద్వారా చిరంజీవికి ముట్టిన పారితోషికం 1,116/- రూపాయలు. మనవూరి పాండవులు, మోసగాడు, రాణీ కాసుల రంగమ్మ, ఇది కథ కాదు వంటి సినిమాలలో చిన్న పాత్రలు, విలన్ పాత్రలు పోషించాడు. ఎ.కోదండరామి రెడ్డి దర్శకత్వంలో వచ్చిన "ఖైదీ" సినిమాతో చిరంజీవి ఒక్కసారిగా తారాపథానికి చేరి హీరోగా నిలద్రొక్కు కున్నాడు.ఇంకా చంటబ్బాయ్,ఛాలెంజ్, శుభలేఖ చిత్రాలలో వివిధ తరహా పాత్రలలో మెప్పించి మంచి గుర్తింపు పొందగా, గ్యాంగ్ లీడర్ సినిమా చిరంజీవికి బలమయిన మాస్ ఇమేజ్ తెచ్చిపెట్టింది.

 

1980, 90లలో రౌడీ అల్లుడు, ఘరానా మొగుడు వంటి వినోదాత్మక చిత్రాలు, స్వయంకృషి, రుద్రవీణ, ఆపద్భాందవుడు వంటి సున్నితమైన పాత్రలతో వచ్చిన సినిమాలు కూడా చేశాడు. తరువాత కొంతకాలం చిరంజీవి సినిమాలు అంతగా విజయ వంతంగా నడువలేదు.మళ్ళీ 1990 దశకం చివరిలో వచ్చిన 'జగదేక వీరుడు అతిలోక సుందరి, హిట్లర్, చూడాలని వుంది'  సినిమాలు మంచి విజయా లను సాధించాయి. 2002లో వచ్చిన  "ఇంద్ర, ఠాగూర్"  సినిమాలు తారాపధంలో చిరంజీవిని అత్యుత్తమ స్థానానికి తీసుకు వెళ్ళింది. ఇదే సమయంలో చిరంజీవి రాజకీయ రంగ ప్రవేశంపై ఊహాగానాలు విస్తృతంగా చర్చనీయ మయ్యాయి. 2007-2008 సంవత్సరాలలో చిరంజీవి రాజకీయాలలోకి రావాలని రాష్ట్రమంతటా ప్రదర్శనలు జరిగాయి.

 
తరువాత వచ్చిన శంకర్ దాదా ఎమ్.బి.బి.ఎస్ వంటి సినిమాలు విజయవంతాలైనా గాని సినిమా బడ్జెట్‌లు విపరీతంగా పెరిగి పోవడం వలనా, ప్రేక్షకుల అంచనాలు అతిగా ఉండడం వలనా, రంగంలో తీవ్రమైన పోటీ నెలకొనడం వలన అంత పెద్ద హిట్‌ లుగా పరిగణించబడడం లేదు.తెలుగు సినిమా రంగంలో చిరంజీవిని మొదటి  "యాక్షన్-డాన్స్ మాస్ హీరో" గా చెప్పుకోవచ్చు. అంతకు ముందు హీరోల సినిమాలలో ఈ అంశాలున్నా వాటికి అంత ప్రాముఖ్యత ఉండేది కాదు పసివాడి ప్రాణం చిత్రం ద్వారా తెలుగు తెరపై మొట్టమొదటి సారిగా 'బ్రేక్ డ్యాన్స్' చేసిన ఘనత చిరంజీవికే దక్కుతుంది. దక్షిణాది హీరోలలో డాన్స్ చేయడంలో గొప్ప పేరు సంపాదించిన మొదటి హీరో చిరంజీవి మాత్రమే అని చెప్పడంలో సందేహం లేదు.

 

బిగ్గర్ దెన్ బచ్చన్.ది న్యూ మనీ మిషన్" అంటూ ప్రఖ్యాత సినిమా మీడియా చేత కీర్తించబడ్డ కొణిదెల శివశంకర వర ప్రసాద్.... చిరంజీవి...స్క్రీన్ నేం  తో ప్రసిద్దుడైన తీరు ఒక వండర్. వృత్తిని సరైన కృషితో ప్రేమించిన ఏ వ్యక్తైనా చిరంజీవి కాగలడు. మనిషి "మనీషి"  గా ఎదిగిన తీరు వర్ణనాతీతం. వేలల్లో అభిమాన సంఘాలు. చిరంజీవి బ్లడ్ బాంక్, ఐ బాంక్ ద్వారా లక్షకు పైగా ప్రజలకు సేవ చేసిన ఆయన కీర్తి చిరస్మరణీయం. 22 ఆగష్ట్ 1955 నాడు పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూర్ లో ఒక చిరు ఉద్యోగి తనయుడుగా జన్మించి ఎదిగిన ఈ చిరుజీవి చిరంజీవి గా రూపాంతరం చెందటము లో ఆయన పడిన కష్టం తీసుకున్న శ్రమ అనుకున్నది సాధించటములో ఆయన చేసిన కృషి ఎదిగిన విదమే ఒక అద్భుతం.

 అల్లు రామలింగయ్య సుపుత్రిక సురెఖను వివాహమాడటం వరకూ ఆయన ప్రయాణం మహాప్రస్థానమే. అనుక్షణం శ్రమ రంజకమే.  నేపధ్యం లో ఏ గాడ్ ఫాదర్ లేకుండా స్వయం కృషి తో ఎదిగిన ఒకే ఒక్క ఆ తరం నటుడు చిరంజీవి మాత్రమే.  ఆయన లోని ప్రతిభను గుర్తించిన ఆంధ్రా విశ్వవిద్యాలయం  గౌరవ డాక్టరేట్ అవార్డ్ ప్రధానం చేసింది. చిరు "గుర్రపు స్వారీ శైలి" చాలా ప్రత్యేకం. ఒక చేత్తో మాత్రమే కళ్ళాన్ని పట్టుకొని, మరొక చేయిని గాలిలో వదిలేసి, గుర్రం పైన పూర్తిగా కూర్చోకుండా కొద్దిగా నిలబడి చిరు చేసే గుర్రపు స్వారీ నయనానందకరం. అంజి, కొండవీటి దొంగ, జగదేకవీరుడు అతిలోకసుందరి చిత్రాల్లో ఈ శైలి మనోరంజకంగా కనిపిస్తుంది.


పౌరాణికాల్లో ఆయన పెద్దగా నటించకపోయినా శివుడు శివుడు శివుడు, ఆపద్భాందవుడు, మంజునాథ చిత్రాలలో శివుడి పాత్రకి చిరంజీవి అతికినట్టు సరిపోయారు.కారణం శివ తాండవం చిరంజీవికంటే ఎవరు బాగాచేయగలరు. నాట్యానికి ఆయన మకుటం లేని మహారాజు. నాట్యంలో బహుముఖ ప్రజ్ఞాశాలిగా తెలుగు చలన చిత్ర రంగంలో ఒక నూతన శకానికి తెర తీశాడనటంలో అతిశయోక్తి లేదు.ప్రారంభదశలో సహనటుడుగా, నెగటివ్ పాత్రలతో విలన్ గా, కొంత నిలదొక్కుకున్న తర్వాత కుటుంబ చిత్రాలతో, రౌద్రం, ప్రతాపం ఉట్టిపడే పాత్రలతో, పిమ్మట అడపా దడపా హాస్యభరిత చిత్రాలతో, అటు సాంఘిక, ఇటు పౌరాణిక పాత్రలతో నటుడుగా చిరంజీవి పరిపూర్ణతని సంతరించుకొన్నాడు.

 
విదేశాల్లో ఆయన ప్రభ కు తార్కాణం పశ్చిమ ఐరోపా, ల్యాటిన్ అమెరికాలలో చిరంజీవి నటించిన దొంగ సినిమా లో గోలి మార్ పాటకి మైఖేల్ జాక్సన్ రూపొందంచిన థ్రిల్లర్ ఆల్బం మూలం. ఈ పాటల్లో చిరు మరియు జాక్సన్ నాట్య భంగిమలు, వేషధారణలలో చాలా సామ్యం కనబడుతుంది. అందుకే ఈ దేశాలలో చిరుని ఇండియన్ జాక్సన్ గా గౌరవిస్తారు. కొదమ సింహం సినిమాను ఇంగ్లీష్ లో "తీఫ్ ఆఫ్ బాగ్దాద్" గా అనువాదం చేయగా అది నార్త్ అమెరికా, మెక్సికొ, ఇరాన్, ఇతర దేశాలలో విజయవంతంగా ప్రదర్శింపబడింది.

2006 లో పద్మభూషన్ తో భారత ప్రభుత్వం ఆయన్ని సత్కరించగా - పదుల్లో అనేక అవార్డ్స్ ఆయన్ని వరించాయి.  1987 వ సంవత్సరములో మూడవ సైమా అవార్డ్ కమిటీ ఆయన్ని "భారతీయ సినిమా అంతర్జాతీయ ముఖచిత్రం" (ఇంటర్నేషనల్ ఫేస్ ఆఫ్ ఇండియన్ సినిమా) గా అభివర్ణించింది. అదే సంవత్సరం లో ఆస్కార్ అవార్డుల కమిటీ పొందిన చిరంజీవిని ఆస్కార్ సెర్మనీకి ఆహ్వానించింది. ఆ గౌరవం పొందిన తొలి దక్షిణ భారత నటుడు చిరంజీవే. 
 
"కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు మహాపురుషులౌతారు" అన్న ఈ సజీవ నానుడిని కొంచెం మార్చి చెప్పమంటే "పట్టుదలే ఉంటే చిరు-జీవి చిరంజీవి" ఔతాడని నిస్సందేహంగా చెప్పవచ్చు. తెలుగుతో పాటు తమిళం, కన్నడం, హిందీ బాషా చిత్రాల్లో కూడా నటించిన చిరంజీవి దేశ వ్యాప్తంగా ప్రసిధ్ధుడుగా నిలిచాడు. దక్షిణ భారతం లో రజనీకాంత్ కు ధీటైన నటుడు చిరంజీవి మాత్రమే. చూశావా! చెయ్యి ఎంత రఫ్ గా ఉందో, రఫ్ ఆడిస్తా, అంతొద్దు ఇదిచాలు, బాక్స్ బద్దలవుద్ది..." ఇలాంటి చిరంజీవి మాటలు తెలుగు నాట ఇప్పటికీ ప్రతి రోజూ వినిపిస్తూనే ఉంటాయి. "మాటలు పదాలు ఎవరో సృష్టించాలిగా లేకుంటే కొత్త కొత్త పదా లెలా పుడతాయి" మాయా బజార్ సినిమాలో ఎస్విఆర్ అనేది చిరంజీవి ద్వారా కూడా నేటికీ నిజమైంది.
 
సుప్రసిద్ధ మానవతావాది భారత ప్రథమ పౌరుడు భారతరత్న ఏపిజె అబ్దుల్ కలాం అమృత హస్తాలతో "చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్" జూన్ 10, 2006 న ప్రారంభించబడి దినదిన ప్రవర్ద మానమైంది. అనేక సేవా సంస్థలు సిసిటి నీడలో రూపుదిద్దు కున్నాయి. చిరంజీవి లాంటి మహావృక్షం నీడలో స్టార్ చిరంజీవి పేరుచెప్పుకొని సినీ రంగములో కోకొల్లలుగా ప్రవేశించిన మెగా కుటుంబ వారసుల్లాగా. సున్నితమనస్తత్వం, మృదుభాషణ, 'నొప్పించక తానొవ్వక' నడవడితో నిజంగా ఆ చిరంజీవికే  (తన దైవం ఆంజనేయ స్వామి) ప్రతిరూపమా! అన్నట్లుండే ఆయన ప్రవర్తన రాజకీయాలకు ఏమాత్రం సూటవలేదు.

 

రాజ‌కీయ రంగంలోను త‌న‌దైన ప్ర‌తిభ‌ను చూపించారు చిరంజీవి. 2008 ఆగ‌స్ట్ 17 న రాజ‌కీయ ప్ర‌వేశంను ప్ర‌క‌టించారు.ఆగ‌స్ట్ 26 న మ‌ధ‌ర్ థెరిస్సా జ‌న్మ‌దినం సంద‌ర్బంగా తిరుప‌తి ఆవిలాల చెరువు మైదానంలో భారీ బ‌హిరంగ స‌భ‌ను ఎర్పాటు చేసి త‌న పార్టీ పేరును ప‌త‌కాన్ని ఆవిష్క‌రించారు. అదే జోరుతో త‌రువాత సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో పోటీప‌డ్డారు.అయితే అప్పుడు వైయ‌స్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి కి ఉన్న క్రేజ్ తో అనుకున్న ప‌లితాల‌ను రాబ‌ట్ట‌లేక‌పోయాడు.

 

త‌రువాత రాజ‌కీయంగా త‌న‌ను న‌మ్ముకున్న వాళ్ల‌కి న్యాయం చేయాల‌నే ఉద్దేశ్యంతో 2011లో ఫిభ్ర‌వ‌రి 6వ తేదిన ప్ర‌జారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. అనంతరం కేంద్ర‌మంత్రిగా కొన‌సాగుతూ అనేక సంక్షేమ కార్య‌క్ర‌మాల‌ను ప్రారంభించారు. త‌న వారికి రాష్ట్ర క్యాబినెట్ లో మంత్రి ప‌ద‌వులు క‌ట్ట‌బెట్టారు.2014 లోపు రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ ఏపీలో తుడిచి పెట్టుకు పోయింది. అయితే కాంగ్రెస్ లో వున్నా.. చిరు ఇప్పుడు కాస్తా రాజ‌కీయ‌ల‌ను ప‌క్క‌న పెట్టి మ‌ళ్లి ఖైదీ నెంబర్ 150తో ప్రేక్ష‌కుల‌ను అల‌రించాడు. ఆయన పట్ల వున్న ప్రేమాభిమానాలను ప్రేక్షకజనం ఆయన ఒక దశాబ్ధం తరవాత తిరిగి నటించిన అతి సాధారణ కథతో నిర్మించిన "ఖైదీ నంబర్ 150" ని దిగ్విజయం చేసి చాటారు. తాజాగా ఉయ్యాల వాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రంలో నటిస్తున్నారు మెగాస్టార్. 

దశాబ్దం తర్వాత వచ్చినా తానే వెండితెర రారాజుగా నిరూపించిన మెగాస్టార్ కు ఎషియానెట్ న్యూస్ తరపున జన్మదిన శుభాకాంక్షలు.

loader