తెలుగు చిత్ర పరిశ్రమ గర్వించదగ్గ నటుల్లో ఎస్వీ రంగారావు ఒకరు. ఎలాంటి పాత్రనైనా అలవోకగా పోషించగల దిట్ట. విశ్వనట చక్రవర్తిగా గుర్తింపు పొందారు. క్లాసిక్స్ గా పేర్కొనబడే అనేక తెలుగు చిత్రాల్లో యస్వీఆర్ అద్భుత నటన కనబరిచారు. త్వరలో ఈ గొప్ప నటుడిని స్మరించుకునే విధంగా విగ్రహావిష్కరణ జరగబోతోంది. 

ఆగష్టు 25న తాడేపల్లి గూడెంలో అభిమానుల సమక్షంలో ఎస్వీఆర్ కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమం జరగబోతోంది. మెగాస్టార్ చిరంజీవి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. చిరు తన చేతుల మీదుగా ఎస్వీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. 

ఎస్వీఆర్ పూర్తి పేరు సామర్ల వెంకట రంగారావు. 1918 జులై 3న ఎస్వీఆర్ కృష్ణ జిల్లా నుజువీడులో జన్మించారు. విద్యార్థి దశ నుంచే నటనపై ఆసక్తి కనబరిచారు. నటన కోసం ఫైర్ ఆఫీసర్ ఉద్యోగాన్ని వదిలేశారు. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో 300పైగా చిత్రాల్లో నటించారు. రావణాసురుడు, కీచకుడు, హిరణ్యకశ్యప, నరకాసురుడు, ఘటోత్కచుడు, మాంత్రికుడు పాత్రల్లో ఎస్వీఆర్ అద్భుతంగా ఒదిగిపోయారు. 

నర్తనశాల చిత్రంలో ఎస్వీఆర్ నటనకు గాను భారత రాష్ట్రపతి పురస్కారం దక్కింది. ఈ గొప్ప నటుడి కాంస్య వివోగ్రహాన్ని మెగాస్టార్ చిరంజీవి ఆవిష్కరించనుండడంతో సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది.