మెగాస్టార్ న్యూ లుక్‌కు సంబంధించి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. లాక్‌ డౌన్ సమయం అంతా ఇంటికే పరిమితమైన మెగాస్టార్ తన తదుపరి చిత్రాల ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసే పనిలో ఉన్నాడు. అందులో భాగంగా కథలు ఫైనల్‌ చేసుకోవటంతో పాటు లుక్‌ టెస్ట్‌లు కూడా చేసేస్తున్నాడు మెగాస్టార్. ప్రస్తుతం ఆచార్య షూటింగ్‌లో ఉన్న చిరు తరువాత మలయాళ సూపర్‌ హిట్ లూసిఫర్‌ను తెలుగు లో రీమేక్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాకు సాహో ఫేం సుజిత్ దర్శకత్వం వహించనున్నాడు.

ఈ సినిమాతో పాటు మరికొంత మంది దర్శకులతో సినిమాలు చేసే ఆలోచనలో ఉన్నాడు. అయితే వీటిలో ఓ సినిమాలో చిరు గుండుతో కనిపించాల్సి ఉంది. అందుకు సంబంధించిన లుక్‌ టెస్ట్‌ను ఇటీవల పూర్తి చేశాడు మెగాస్టార్‌. తాజాగా ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో చిరు సన్నిహితులు ఆ ఫోటోకు సంబంధించి క్లారిటీ ఇచ్చారు. భవిష్యత్తులో చేయాలనుకుంటున్న ఓ సినిమాకు సంబంధించిన లుక్‌ టెస్ట్ అంటూ క్లారిటీ ఇచ్చారు.

ప్రస్తుతం మెగాస్టార్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆచార్య సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. లాక్‌ డౌన్‌ కారణంగా ఆగిపోయిన ఈ సినిమా షూటింగ్‌ను త్వరలోనే ప్రారంభించే ఆలోచనలో ఉన్నారు. ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్లపై రామ్‌ చరణ్‌, నిరంజన్‌ రెడ్డిలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.