మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం సైరా నరసింహారెడ్డి చిత్రంతో బిజీగా ఉన్నాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం దాదాపు 200 కోట్ల బడ్జెట్ లో రూపొందుతోంది. రాంచరణ్ ఈ చిత్రానికి నిర్మాత. ఇదిలా ఉండగా చిరు తన రీ ఎంట్రీ తర్వాత ఆచి తూచి మాత్రమే చిత్రాలని ఎంపిక చేసుకుంటున్నాడు. సైరా తర్వాత కొరటాల శివ దర్శత్వంలో చిరంజీవి నటించాల్సి ఉంది. ఆ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటించేందుకు కూడా కమిట్మెంట్ ఇచ్చాడు. 

ఇదిలా ఉండగా చిరంజీవితో సినిమా చేయాలని స్టార్ డైరెక్టర్స్ నుంచి నూతన దర్శకుల వరకు అందరూ కోరుకుంటారు. రేసు గుర్రం, టెంపర్ లాంటి సూపర్ హిట్ చిత్రాలకు వక్కంతం వంశీ కథలు అందించారు. రచయితగా మంచి గుర్తింపు సొంతం చేసుకున్న తర్వాత వంశీ దర్శకత్వం వహించిన తొలి చిత్రం నా పేరు సూర్య. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన ఈ చిత్రం నిరాశపరిచింది. 

చిరంజీవి కోసం వంశీ ఓ కథ సిద్ధం చేసుకున్నారట. ఇటీవల చిరంజీవిని కలసిన వంశీ ఆయనకు కథ వినిపించినట్లు వార్తలు వస్తున్నాయి. కానీ వంశీ చెప్పిన కథ చిరుని అంతగా ఆకట్టుకోలేకపోయిందని సమాచారం. దీనితో చిరు వంశీకి నో చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. వంశీకి చిరు నో చెప్పడానికి నా పేరు సూర్య పరాజయం కూడా ఓ కారణం అని ప్రచారం జరుగుతోంది.   

ఇదిలా ఉండగా చిరంజీవి, కొరటాల కాంబినేషన్ లో చిత్రం ఆగష్టు నుంచి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. భరత్ అనే నేను తర్వాత నుంచి కొరటాల చిరు కోసం ఎదురుచూస్తున్నాడు. ఇక వక్కంతం వంశీ నుంచి కూడా నా పేరు సూర్య తర్వాత మరో ప్రకటన రాలేదు.