బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్.. మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న 'సై  రా నరసింహారెడ్డి' సినిమాలో కీలక పాత్ర పోషిస్తోన్న సంగతి తెలిసిందే. కొద్దిరోజుల క్రితం అమితాబ్ లుక్ ఎలా వుండబోతుందనే ఫోటోలు లీక్ అయ్యాయి. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గురువు పాత్రలో అమితాబ్ కనిపించనున్నాడని టాక్. అయితే ఈ సినిమాకు అమితాబ్ ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారనే విషయంపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.

నిజానికి అమితాబ్ ఈ సినిమాలో తన స్నేహితుడు చిరంజీవి రిక్వెస్ట్ చేయడంతో నటించాడు. రెమ్యునరేషన్ తీసుకోనని ముందే చెప్పేశాడట. చిరు మీద గౌరవంతో సినిమా చేస్తున్నానని తనకు ఎలాంటి రెమ్యునరేషన్ వద్దని చెప్పడంతో మెగాస్టార్ చిరంజీవి.. అమితాబ్ కోసం ఓ విలువైన బహుమతి తీసుకొని ఆయనకు కానుకగా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇంత ఆ కానుక విలువెంతో తెలుసా..? అక్షరాలా రూ.3 కోట్ల రూపాయలు.

అమితాబ్ పారితోషికం నిరాకరించడంతో చిరంజీవి మూడు కోట్ల విలువైన బంగారాన్ని అమితాబ్ కి అందించారట. 1980 ల నుండి అమితాబ్, చిరుల మధ్య స్నేహబంధం కొనసాగుతోంది. అయితే మొదటిసారి వారిద్దరూ కలిసి స్క్రీన్ ను పంచుకోవడం విశేషం. సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా వచ్చే ఏడాది వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. రామ్ చరణ్ దాదాపు రూ.200 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.