మలయాళ విలక్షణ నటుడు జయరామ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సంస్కృత చిత్రం నమో. ఈ సినిమా ట్రైలర్‌ను మెగాస్టార్‌ చిరంజీవి ట్విటర్‌ ద్వారా రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన చిత్రయూనిట్‌కు అభినందనలు తెలిపారు. `జయరామ్ పాత్రలో పరకాయ ప్రవేశం చేసిన తీరు, పాత్ర కోసం ఆయన మారినీ తీరు అద్భుతం. సినిమా ఘన విజయం సాధిస్తుందని ఆశిస్తున్నా. సోదరుడు జయరామ్ ఈ సినిమాలోని పాత్రతో ప్రేక్షకుల హృదయాలతో పాటు ఎన్నో అవార్డులు కూడా సాధిస్తాడని ఆశిస్తున్నా` అంటూ ట్వీట్ చేశాడు.

త్వరలో రిలీజ్ కు రెడీ అవుతున్న ఈ సినిమాకు విజ్జిష్‌ మణి దర్శకుడు. ఈ సినిమాలో జయరామ్‌ శ్రీ కృష్ణుడి బాల్య మిత్రుడు కుచేలుడి పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా అనస్వర చారిటబుల్‌ ట్రస్ట్‌ నిర్మిస్తోంది. ఇటీవల కాలంలో పూర్తిగా సంస్కృత భాషలో తెరకెక్కుతున్న సినిమా ఇదే కావటం విశేషం. విలక్షణ నటుడు జయరామ్, ప్రేక్షకులను భక్తిరస లోకంలోకి తీసుకెళ్లటం ఖాయం అంటున్నారు మలయాళ ప్రేక్షకులు. ఇటీవల తెలుగు భాగమతి, అల వైకుంఠపురములో సినిమాలతో జయరామ్ తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గర కావటంతో ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లోనూ భారీగా రిలీజ్ చేయాలని భావిస్తున్నారు.

ఈ సినిమాలో పాత్ర కోసం జయరామ్ ఎంతో కష్టపడ్డాడు. గుండు కొట్టించుకోని దాదాపు 20 కేజీల వరకు బరువు తగ్గి మరీ ఈ పాత్రలో నటించాడు. అయితే ఈ సినిమా రిలీజ్ పై ఇంకా క్లారిటీ రావాల్సింది. ప్రస్తుతం పరిస్థితుల్లో థియేటర్లు ఓపెన్‌ చేయడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉండటంతో అప్పటి వరకు వెయిట్ చేస్తారా..? లేక ఓటీటీ ద్వారా రిలీజ్ చేస్తారా అన్న విషయం తెలియాల్సి ఉంది.