Asianet News TeluguAsianet News Telugu

ప్లాస్మా దానం అంటూ కడుపుబ్బా నవ్వించిన చిరు..

శుక్రవారం ఆయన ప్లాస్మా దాతలను సత్కరించేందుకు సైబరాబాద్‌ సీపీ వీసీ సజ్జనార్‌ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్నారు. మొత్తం 150 మంది ప్లాస్మా డోనర్లను చిరంజీవి సన్మానించారు. కరోనా వేళ ఫ్రంట్‌లైన్‌ వారియర్లుగా సేవలందిస్తున్న పోలీసులకు చిరంజీవి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా చిరంజీవి నవ్వులు పూయించారు.

megastar chiranjeevi has asked those who have recovered from the corona to donate plasma
Author
Hyderabad, First Published Aug 7, 2020, 6:58 PM IST

కరోనా వైరస్‌ బారిన పడి కోలుకున్న వారు ప్లాస్మా దానం చేస్తే మరికొందరి ప్రాణం పోసినవాళ్లమవుతారని అన్నారు మెగాస్టార్‌ చిరంజీవి. ప్లాస్మా మన బాడీలో ఉన్న సంజీవని, దాన్ని దానం చేసి పదిమందికి జీవితాన్ని ఇవ్వాలని కోరారు. శుక్రవారం ఆయన ప్లాస్మా దాతలను సత్కరించేందుకు సైబరాబాద్‌ సీపీ వీసీ సజ్జనార్‌ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్నారు. మొత్తం 150 మంది ప్లాస్మా డోనర్లను చిరంజీవి సన్మానించారు. కరోనా వేళ ఫ్రంట్‌లైన్‌ వారియర్లుగా సేవలందిస్తున్న పోలీసులకు చిరంజీవి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా చిరంజీవి నవ్వులు పూయించారు. ప్లాస్మా దానం గురించి చెబుతూ చిరు మధ్యలో దగ్గుతో కాస్త ఇబ్బంది పడ్డారు. ఆయన పక్కనే ఉన్న పోలీస్ అధికారి ఒకరు నీళ్లు అందించారు. 

ఈ సందర్భంగా చిరు స్పందిస్తూ, దగ్గితే భయం వేస్తుందని, తాను దగ్గుతున్నానని డౌట్ పడొద్దన్నారు. దీంతో అక్కడ ఒక్కసారిగా నవ్వుల మోత మోగింది. దగ్గాలంటే భయం వేస్తోందని.. చిన్న దగ్గు దగ్గినా, ఎలర్జీతో తుమ్ము వచ్చినా పక్కన వాళ్లు జరిగిపోతున్నారని వ్యాఖ్యానించారు. కర్మ అంటూ తమ ఇంట్లో పరిస్థితిని తెలిపారు. ఇంటికి వెళ్లి తన శ్రీమతి సురేఖపై సరదాగా చెయ్యి వేసినా.. తను కూడా దూరం జరుగుతోందంటూ హాస్యాన్ని పండించారు. భౌతిక దూరం ఉండొచ్చు కానీ.. భార్యాభర్తల మధ్య కూడా ఉండాల్సి వస్తోందంటూ నవ్వించారు. ఇదిలా ఉంటే, తన ప్రసంగం ముగింపు సందర్భంగా ఇకపై ఏ ప్రజోపయోగ కార్యక్రమం చేపట్టినా తనను వినియోగించుకోవాలని కార్యక్రమంలో పాల్గొన్న సైబరాబాద్ సీపీ సజ్జనార్‌ను చిరు కోరారు. తనను ఓ వెపన్‌గా ఉపయోగించుకోవాలంటూ ... సజ్జనార్ చేతిలో వెపన్ అంటే కొంచెం అని ఆగిపోయారు. దీంతో అక్కడున్న వారంతా నవ్వుకున్నారు. 

ఇక ప్లాస్మా దానం గురించి ఆయన స్పందిస్తూ, `కరోనా రోగుల కోసం ప్లాస్మా డొనేషన్ ఇవ్వడం అనేది ఒక యుద్ధం.. ప్లాస్మా చికిత్సతో రోగులు త్వరగా కోలుకుంటున్నారు.  కరోనాకు మందు లేని పరిస్థితుల్లో అయోమయం ఉంది. ప్లాస్మా దానం చేయడం అనేది బాధితుల పాలిట సంజీవనిగా ఉంది. కరోనా బాధితులకు ప్లాస్మా ఇస్తే 99 శాతం వారు బతికే అవకాశం ఉంది. ప్లాస్మాలో ఉండే యాంటీబాడీల వల్ల కరోనా సోకిన వ్యక్తి దాని నుంచి త్వరగా కోలుకుంటున్నాడు. ఒక్కరు ప్లాస్మా దానం చేస్తే దాని వల్ల 30 మందికి సాయం చేయవచ్చు. ప్లాస్మా దానం వల్ల రక్తం నష్టపోవడం అనేది ఉండబోదని.. ప్లాస్మా తగ్గినా రెండు రోజుల్లో అది రికవరీ అవుతుంది. కరోనా నుంచి కోలుకున్న వారు ధైర్యంగా ప్లాస్మా దానం చేయాలి. అందరూ జాగ్రత్తగా ఉంటే 100 శాతం కరోనాను ఎదుర్కొవచ్చు. కొన్నాళ్లు పోతే మందు వచ్చాక జలుబు, జ్వరం మాదిరిగా కరోనా మారిపోతుంద`ని అన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios