హైదరాబాద్: సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ అయిన చిరంజీవి ఆపదలో ఉన్ననటులను ఆదుకుంటూ ఆపన్నహస్తం అందిస్తున్నారు. ఇటీవలే ప్రముఖ దర్శకుడు, నటుడు రాఘవ లారెన్స్ ట్రస్ట్ కు రూ.10 లక్షలు అందజేసిన చిరంజీవి తాజాగా మరో సినీనటికి రూ.2లక్షలు ఆర్థికసాయం అందజేశారు. 

అల్లరి సినిమాతో ప్రముఖ నటిగా పేరు సంపాదించిన సీనియర్‌ నటి సుభాషిణీ తీవ్ర కష్టాల్లో ఉన్నారు. గత కొంతకాలంగా క్యాన్సర్‌ వ్యాధితో బాధపడుతున్న ఆమె ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నారు. ఆమె కష్టాల గురించి తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. 

ఆమెకు రూ. 2 లక్షల ఆర్థిక సాయాన్నిప్రకటించారు. చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ స్వయంగా ఆమె ఇంటికి వెళ్లి రూ.2లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. సుభాషిణి తీసుకుంటున్న వైద్యం, ఆరోగ్య పరిస్థితులపై శ్రీజ అడిగి తెలుసుకున్నారు. 

కష్టాల్లో ఉన్న సీనియర్‌ నటికి ఆర్థిక సాయం అందజెయ్యడంపై మెగాస్టార్ చిరంజీవిపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. అటు సోషల్ మీడియాలో సైతం నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.