క‌రోనాతో దెబ్బ ప్రభావం బ్ల‌డ్ బ్యాంకుల మీద పడిన సంగతి తెలిసిందే. దేశ వ్యాప్తంగా కూడా అనేక చోట్ల రక్తం దొరక  లేదు. ర‌క్త దాత‌లు సైతం ఇంటికే ప‌రిమితం అయిపోవ‌డం వ‌ల్ల ఎక్క‌డా రక్తం దొర‌క‌టం కష్టమైపోయింది.దాంతో... ముఖ్యంగా త‌ల‌సిమియా వ్యాధిగ్ర‌స్తుల‌కు నిరంత‌రం బ్ల‌డ్ అందాల్సి ఉండ‌గా.. ర‌క్తం దొర‌క‌క క్లిష్ఠ ప‌రిస్థితిని ఎదుర్కొన్నారు. మారుమూల గ్రామాల నుంచి వ‌చ్చిన ఎంద‌రో ఆప‌రేష‌న్లు జ‌ర‌గ‌క ఎమ‌ర్జెన్సీ ప‌రిస్థితుల్లో ఇబ్బందిపడ్డారు. ర‌క్తం ల‌భ్యం కాక డాక్ట‌ర్లు ఆప‌రేష‌న్లు వాయిదా వేసారు. 

ఈ పరిస్దితులు అన్ని ఇప్పుడిప్పుడే ఓ కొలిక్కి వచ్చాయి. ఇలాంటి క్లిష్టమైన సమయంలో చిరంజీవి తన బ్లడ్ బ్యాంక్ ద్వారా చాలా సాయం చేసారు. ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు. గివ్ బ్లడ్ సేవ్ లైఫ్‌... నినాదంతో చిరంజీవి బ్ల‌డ్ బ్యాంక్ నిరంత‌రం సేవ‌లందిస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే ప్ర‌స్తుతం బ్ల‌డ్ బ్యాంకుల‌కు ర‌క్త దాత‌ల కొర‌త తీవ్రంగా వేధిస్తోంది. దీన్ని దాటేందుకు చిరంజీవి మరోసారి రక్తదానం కోసం మెగాభిమానులకు పిలుపు ఇచ్చారు. 

ఈ రోజు 72వ గణతంత్ర దినోత్సవ సందర్బంగా శుభాకాంక్షలు తెలిపుతూ రక్తదానం చేయమంటూ ఆడియో మెసేజ్ వదిలారు చిరు. “ఈ రిపబ్లిక్ డే సందర్భాన్ని పురస్కరించుకొని విస్తృతంగా రక్త దానం చేయసంకల్పించిన మెగా బ్లడ్ బ్రదర్స్ ని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను. నా పిలుపు మేరకు స్పందించి చిరంజీవి బ్లడ్ బ్యాంక్ కు వచ్చి రక్త దానం చేసిన, చేస్తున్న రక్తదాతలకు హృదయ పూర్వక అభినందనలు. రక్త దానం చేయండి, ప్రాణదాతలు కండి.. జై హింద్.. ” అంటూ చిరంజీవి వాయిస్ ద్వారా ట్విట్టర్ లో తెలిపారు. 

మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న తాజా సినిమా 'ఆచార్య'. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో చందమామ కాజల్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్‌ జరుపుకొంటున్న ఈ సినిమాలో రామ్‌ చరణ్‌ కీలకపాత్రలో నటిస్తున్నాడు.