మెగామేనల్లుడు సాయి ధరం తేజ్ ప్రస్తుతం కిషోర్ తిరుమల దర్శకత్వంలో 'చిత్రలహరి' అనే సినిమాలో నటిస్తున్నాడు. తాజాగా సినిమాకు సంబంధించిన టీజర్ ని విడుదల చేసింది చిత్రబృందం. దీనికి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది.

ఏప్రిల్ 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. సినిమా విడుదలకు దగ్గర పడుతుండడంతో ధరం తేజ్ తన తదుపరి చిత్రంపై దృష్టి పెట్టాడు. ఈసారి తన సినిమా కోసం సొంతంగా కథ రాసుకుంటున్నాడట.

కథ పూర్తయిన తరువాత స్క్రీన్ ప్లే పనులు కూడా మొదలుపెట్టడానికి రెడీ అవుతున్నాడు. ఇప్పటికే ఫ్లాప్ లతో సతమవుతున్న ఈ హీరో ఏకంగా సొంత కథతో సినిమా చేయడానికి రెడీ అవ్వడం కొందరిని ఆశ్చర్యపరుస్తోంది.

సొంత కథతో పెద్ద ప్రయోగానికి సిద్ధమవుతున్నాడనే మాటలు సినీ సర్కిల్స్ లో వినబడుతున్నాయి. 'చిత్రలహరి' గనుక మంచి సక్సెస్ అయితే తేజుకి కొంతవరకు ప్రోత్సాహం దక్కుతుంది. మరేం జరుగుతుందో చూడాలి!