కెరీర్ మొత్తంగా ఇప్పటి వరకు ఎనిమిది సినిమాలు. అందులో చెప్పుకోదగిన సినిమాలు మూడు. గత నాలుగు సినిమాలు డిజాస్టర్లు. ఇదీ మన సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ ట్రాక్ రికార్డ్. ఇలాంటి పరిస్థితుల్లో వి.వి.వినాయక్ లాంటి సెన్సేషనల్ డైరెక్టర్‌తో సినిమా. ఇంకేంటి తన తొమ్మిదో సినిమా హిట్టు గ్యారంటీ అని అనుకున్నాడు తేజూ. వినాయక్ లాంటి సీనియర్ డైరెక్టర్‌తో సినిమా చేయడం తన అదృష్టమని కూడా అన్నాడు. ‘ఇంటిలిజెంట్’ హిట్టు ఖాయమని వినాయక్‌తో పాటు చిత్ర యూనిట్ మొత్తం నమ్మకంగా ఉంది. కానీ తేజూ మళ్లీ దెబ్బకొట్టాడంటున్నారు ప్రేక్షకులు.
 

సాయిధరమ్ తేజ్, లావణ్య త్రిపాఠి జంటగా నటించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ఇంటిలిజెంట్’. సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ (ప్రై) లిమిటెడ్ పతాకంపై సి.కళ్యాణ్ నిర్మించిన ఈ సినిమా నేడు (ఫిబ్రవరి 9న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాను చూసిన మెగా అభిమానులు, ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు. అసలు ఇది వి.వి.వినాయక్ సినిమాలానే లేదంటున్నారు. సాయిధరమ్ తేజ్ పరిచయ సన్నివేశం, రెండు మూడు కామెడీ సీన్లు, చమక్ చమక్ చాం పాట తప్ప ఇంకేమీ లేదని ప్రేక్షకులు అంటున్నారు. మొత్తానికి ఫస్టాఫ్ చాలా బోరింగ్‌గా ఉందని సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తున్నారు.దీనికి తోడు మెగాస్టార్ చిరంజీవిని తేజూ అస్తమానూ ఇమిటేట్ చేయడం చిరాకు పుట్టిస్తుందట. మొత్తానికి సాయిధరమ్ తేజ్‌కు ‘ఇంటిలిజెంట్’ మరో డిజాస్టర్ అనే చెప్పాలి. స్టార్ డైరెక్టర్లను కాదు.. తేజూ కథలను, కథనాలను నమ్ముకుంటే బెటర్.