మెగాస్టార్ చిరంజీవి సినీ ప్రస్థానంపై పసుపులేి రామారావు పుస్తకం రామారావు రాసిన పుస్తకాన్ని ఆవిష్కరించిన రామ్ చరణ్

మెగాస్టార్ చిరంజీవి సినీ ప్ర‌స్ధానం గురించి సీనియ‌ర్ పాత్రికేయుడు ప‌సుపులేటి రామారావు మెగా చిరంజీవితం 150 అనే పుస్త‌కాన్ని ర‌చించారు. ఈ పుస్త‌కాన్ని మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ఆవిష్క‌రించి తొలి పుస్త‌కాన్ని డైన‌మిక్ డైరెక్ట‌ర్ వి.వి.వినాయ‌క్ కి అంద‌చేసారు.

ఈ సంద‌ర్భంగా మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ మాట్లాడుతూ...సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ పసుపులేటి రామారావు 45 సంవ‌త్స‌రాలుగా జ‌ర్న‌లిస్ట్ గా వ‌ర్క్ చేస్తూ ఇండ‌స్ట్రీకి సేవ చేస్తున్నారు. ఒక రోజు చిరంజీవి గారు 150వ సినిమా చేస్తున్న సంద‌ర్భంగా పుస్త‌కం తీసుకురావాలి అనుకుంటున్నాను అనగానే ఓకే అన్నాను. అయితే...ఇన్ని క‌ల‌ర్ పేజీల‌తో ఇంత క‌ల‌ర్ ఫుల్ గా పుస్త‌కాన్ని తీసుకువ‌స్తార‌ని అస‌లు ఊహించ‌లేదు. చిరంజీవి గారి సినీ ప్ర‌స్ధానం నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు బ‌హుశా అన్ని కోణాల‌ను క‌వ‌ర్ చేసి ఉంటారు అనుకుంటున్నాను. ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ లోనే ఈ పుస్త‌కాన్ని ఆవిష్క‌రించాలి అనుకున్నాం కానీ కుద‌ర‌లేదు. ఈరోజు రామ్ చ‌ర‌ణ్ చేతుల మీదుగా ఆవిష్క‌రించ‌డం సంతోషం. ఈ సంద‌ర్భంగా మా కుటుంబం త‌రుపున ధ‌న్య‌వాదాలు తెలియ‌చేస్తున్నాం అన్నారు.

డైరెక్ట‌ర్ వినాయ‌క్ మాట్లాడుతూ...రామారావు గారికి చిరంజీవి గారు అంటే ఎంత అభిమాన‌మో...చిరంజీవి గారికి రామారావు గారంటే కూడా అంతే అభిమానం. ఒక‌టిరెండు సంద‌ర్భాల్లో చిరంజీవి గారు రామారావు గారు గురించి నాకు చెప్పారు. ఇక ఈ పుస్త‌కం అద్భుతంగా ఉంది. ఈ పుస్త‌కంలోని స్టిల్స్ చూస్తుంటే...నేను ప‌ద‌వ త‌ర‌గ‌తి, ఇంట‌ర్మీడియ‌ట్ టైమ్ లో చిరంజీవి గారి సినిమాల‌కు వెళ్లిన రోజులు గుర్తుకువ‌స్తున్నాయి.

చిరంజీవి గారి అభిమానులు ఈ పుస్త‌కం చ‌దివితే చిరంజీవి గారి పాత సినిమాల టైమ్ లో జ‌రిగిన సంఘ‌ట‌న‌లు గుర్తుకువ‌స్తాయి. చిరంజీవి అంటే స్వ‌యంకృషి అని రాసారు. ఈ ఒక్క ప‌దం చాలు పుస్త‌కం ఎలా ఉంటుందో చెప్ప‌డానికి. మంచి పుస్త‌కాన్ని అందించిన రామారావు గారికి థ్యాంక్స్ తెలియ‌చేస్తున్నాను అన్నారు.

నిర్మాత సి.క‌ళ్యాణ్ మాట్లాడుతూ....ప‌సుపులేటి రామారావు గారు కోత‌ల‌రాయుడు సినిమాకి నేను అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా వ‌ర్క్ చేసిన‌ప్ప‌టి నుంచి తెలుసు. మెగాస్టార్ గురించి అద్భుత‌మైన పుస్త‌కం రాసారు. ఈ పుస్త‌కాన్ని ప్ర‌తి అభిమాని చ‌ద‌వాలి అన్నారు.

సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ ప‌సుపులేటి రామారావు మాట్లాడుతూ....ఈ పుస్తకాన్ని 25 రోజుల్లో పూర్తి చేసాను. టి.కృష్ణ గారి పై పుస్త‌కం రాసిన‌ప్పుడు ఈ ఆలోచ‌న వ‌చ్చింది. అల్లు అర‌వింద్ గార్ని క‌లిసి చెబితే ఓకే అని చెప్పి ఈ పుస్త‌కం కోసం నేను ఏం చేయాలి అని అడిగితే ఇంట‌ర్ వ్యూ ఇస్తే చాలు అన్నాను. ఓకే అని అన్న‌ట్టుగానే ఇంట‌ర్ వ్యూ ఇచ్చారు. ఇది ఫ‌స్ట్ ఎఛీవ్ మెంట్ గా భావించాను. ఆత‌ర్వాత చిరంజీవి గారికి చెబితే ఆయ‌న కూడా ఇంట‌ర్ వ్యూ ఇచ్చారు. ఇది నా రెండో ఎఛీవ్ మెంట్ గా భావించాను. దాస‌రి గారికి చెబితే ఆర్టిక‌ల్ రాసి ఇచ్చారు. ఈ మూడు ఈ పుస్త‌కానికి హైలెట్స్. గ‌తంలో చిరంజీవి గారు గురించి ఓ పుస్త‌కాన్ని రాసాను. పాత టైటిల్ కే 150 అని చేర్చాను. అయితే ఈ పుస్తకానికి ఈ పుస్త‌కానికి సంబంధం ఉండ‌దు. చిరంజీవి గారు ప్రాణం ఖ‌రీదు సినిమా చేస్తున్న‌ప్పుడు నేను విశాలాంధ్ర ప‌త్రిక‌లో ప‌ని చేసాను. అప్పుడు చిరంజీవి గారి గురించి నేను ఆర్టిక‌ల్ రాస్తే త‌ర్వాత క‌లిసిన‌ప్పుడు ఆర్టిక‌ల్ చ‌దివాను చాలా బాగుంది అని మెచ్చుకున్నారు. అప్ప‌టి నుంచి చిరంజీవి గారితో ప‌రిచ‌యం. ఆయ‌న స్వ‌యంకృషితో పైకి రావ‌డాన్ని చూసిన‌వాడిని. ఈ పుస్త‌కం కోసం స‌హ‌క‌రించిన ప్ర‌తి ఒక్క‌రికీ ధ‌న్య‌వాదాలు తెలియ‌చేస్తున్నాను అన్నారు.

రామ్ చ‌ర‌ణ్ మాట్లాడుతూ...నాన్న గారి గురించి ప‌సుపులేటి రామారావు గారు పుస్త‌కం రాయ‌డం చాలా సంతోషంగా ఉంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్, తెలంగాణ‌లో నెం 1 జ‌ర్న‌లిస్ట్ ప‌సుపులేటి రామారావు గారు. మా ఫీల్డ్ లో మాకు నాన్న‌గారు ఎలా ఇన్ స్పిరేష‌నో...జ‌ర్న‌లిజంలో ఇప్ప‌టి వాళ్ల‌కు రామారావు గారు ఇన్ స్పిరేష‌న్ అనిపిస్తుంది. ఈ పుస్త‌కంలో ఫోటోలు చాలా బాగున్నాయి. నేను కూడా ఇప్ప‌టి వ‌ర‌కు చూడ‌ని ఫోటోలు ఈ పుస్త‌కంలో ఉన్నాయి. మా లైబ్రెరీలో నెం 1 పుస్త‌కం ఇదే అవుతుంది. ఫ్యాన్స్ అంద‌రూ ఈ పుస్త‌కం కొనండి. నాన్న‌గారి త‌రుపున ఫ్యామిలీ అంద‌రి త‌రుపున రామారావు గార్కి థ్యాంక్స్ తెలియ‌చేస్తున్నాను అన్నారు.