Asianet News TeluguAsianet News Telugu

రోజా నోటికి దానికి పెద్ద తేడా లేదు.. ముందు ఆ పని నేర్చుకో: నాగబాబు కౌంటర్

ఆంధ్రప్రదేశ్ మంత్రి ఆర్కే రోజాపై సినీ నటుడు, జనసేన నేత నాగబాబు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇటీవల రోజా మెగా ఫ్యామిలీపై చేసిన కామెంట్స్‌పై స్పందించిన నాగబాబు ఆమెకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. 

Mega Brother Nagababu Strong Counter To Minister RoJa
Author
First Published Jan 7, 2023, 9:56 AM IST

ఆంధ్రప్రదేశ్ మంత్రి ఆర్కే రోజాపై సినీ నటుడు, జనసేన నేత నాగబాబు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇటీవల రోజా మెగా ఫ్యామిలీపై చేసిన కామెంట్స్‌పై స్పందించిన నాగబాబు ఆమెకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. రోజా బాధ్యత మరించిపోయి ఇలాగే నోటికొచ్చినట్లు మాట్లాడితే.. ఏపీలో పర్యాటక శాఖ పరిస్థితి మరింత దయనీయంగా మారుతుందని  విమర్శించారు. చిరంజీవిపై, పవన్ కల్యాణ్‌పై రోజా నోటికొచ్చినట్టుగా వాగినా కూడా తాము స్పందించలేదని.. ఎందుకంటే ఆమె నోటికి మున్సిపాలిటీ కుప్పతొట్టికి పెద్ద తేడా లేదని మండిపడ్డారు. ఈ మేరకు నాగబాబు సోషల్ మీడియాలో ఓ వీడియో విడుదల చేశారు. 

‘‘రోజా.. భారతదేశ పర్యాటకశాఖ ర్యాంకింగ్స్‌లో ఉన్న 20 స్థానాల్లో మొదటి మూడు స్థానాల్లో కేరళ, అస్సాం, గుజరాత్‌లు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ 18వ స్థానంలో ఉంది. ఇంకా కిందకు వెళితే ఛత్తీస్‌గడ్, జార్ఖండ్‌లు ఉన్నాయి. నువ్వు ఇలాగే నీ బాధ్యతను మర్చిపోయి.. నోటికొచ్చినట్లు పిచ్చ పిచ్చగా మాట్లాడితే అతి త్వరలో అంటే నువ్వు పదవి దిగిపోయేలోగా 20వ స్థానానికి తీసుకెళ్లే అవకాశం ఉంది.  ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కొన్ని వేల మంది ప్రత్యక్షంగానో, పరోక్షంగానో జీవిస్తున్నారు. మీ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ల జీవితాలు మట్టికొట్టుకుపోయాయి. నువ్విలాగే పిచ్చి పిచ్చిగా మాట్లాడితే వాళ్ల పరిస్థితి మరింత దిగజారిపోతుంది. ముందు పర్యాటశాఖ మంత్రిగా నీ బాధ్యతలు నువ్వు తెలుసుకో! పర్యాటకశాఖ మంత్రి అంటే నువ్వు పర్యటన చేయడం కాదు.. పర్యాటక శాఖను ఎలా డెవలప్ చేయాలో తెలుసుకో. నువ్వు ఇన్ని రోజులు మా అన్నయ్య చిరంజీవి, పవన్ కల్యాణ్‌ను నోటికొచ్చినట్టుగా వాగినా (ఆఫ్‌కోర్స్ నా గురించి కూడా మాట్లాడావు కానీ నేను లెక్కచేయను) కూడా మేము ఎందుకు రియాక్ట్ అవ్వలేదంటే.. దానికి ఒకటే ఒక్క కారణం ఉంది. నీ నోటికి మున్సిపాలిటీ కుప్పతొట్టికి పెద్ద తేడా లేదు.. చూస్తా చూస్తా మున్సిపాలిటీ ఎవరూ కుప్పతొట్టిని గెలకరు అదే కారణం. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని పర్యాటకశాఖను ఎలా డెవలప్‌ చేయాలో నేర్చుకో’’ అని నాగబాబు వీడియోలో పేర్కొన్నారు. 

 

ఇక, ఇటీవల రోజా మాట్లాడుతూ.. మెగా ఫ్యామిలీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ‘‘పవన్ కల్యాణ్ లాంటి మానవత్వం లేని వ్యక్తి ఒక ఆర్టిస్టు అయినందుకు.. ఆర్టిస్టుగా సిగ్గుపడుతున్నాను. జనరల్‌గా ఆర్టిస్టులు అంటే చాలా సెన్సెటీవ్‌గా ఉంటారు. ఎంజీఆర్, జయలలిత, ఎన్టీఆర్‌ లాంటివారిని మనం చూశారు. వీరంతా  ప్రజల్లో ఉంటూ వారి భరోసాను పొంది సీఎంలు అయ్యారు. ఈ కుటుంబంలో ఎవరూ ఎందుకు కాలేదంటే.. వీళ్లను ఆ స్థాయిలో తీసుకొచ్చిన ప్రజలకు కనీసం ఇప్పటివరకు ఏ చిన్న సాయం కూడా చేయలేదు. సొంత జిల్లాకు ఏమీ చేయలేకపోవడం వల్లే ముగ్గురు అన్నదమ్ములను ఓడించారు. పవన్ కల్యాణ్ సరైన సమయంలో స్పందిస్తే ప్రజలుకు కూడా ఆయనకు మద్దతు పలుకుతారు. చంద్రబాబు తప్పులు చేసినప్పుడు పవన్ కళ్యాణ్ మూతికి ప్లాస్టర్ వేసుకుంటాడడు. చంద్రబాబు తప్పులు చేసి ఇరుక్కున్న సమయంలో ఆయనకు మద్దతుగా ప్రభుత్వంపై విమర్శలు చేస్తుంటాడు. దీన్ని బట్టి ప్యాకేజీ కోసం పవన్ కళ్యాణ్ ఎంత విధేయతగా ఉన్నాడో అర్థమవుతుంది’’ అని అన్నారు. 

ఇదిలా ఉంటే.. గతంలో నాగబాబు, రోజాలు జబర్దస్త్‌ షోలో జడ్జిలుగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. అయితే వీరిద్దరి రాజకీ పార్టీలు వేరైనా.. నాగబాబు ఇలా ఓపెన్‌గా రోజాకు కౌంటర్ ఇవ్వలేదు. రోజా గతంలో పవన్‌పై విమర్శలు చేసిన నాగబాబు స్పందించలేదు. అయితే ఇప్పుడు చిరంజీవిపై కూడా రోజా విమర్శలు చేయడం.. ఏ సాయం చేయరంటూ కామెంట్స్ చేసిన నేపథ్యంలో నాగబాబు కూడా ఎప్పుడూ రోజాపై ఇలా ఘాటు వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తోంది. మరోవైపు రోజాపై మెగా అభిమానులు కూడా మండిపడుతున్నారు. జబర్దస్త్ నటుడు గెటప్ శ్రీను కూడా మెగా ఫ్యామిలీపై రోజా చేసిన విమర్శలపై స్పందించారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios