Asianet News TeluguAsianet News Telugu

మేడ మీద అబ్బాయితో నా పంథా మార్చాను: అల్లరి నరేష్

  • అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన మేడ మీద అబ్బాయి
  • మేడ మీద అబ్బాయి తర్వాత విభిన్న కథలు వస్తాయంటున్న నరేష్
  • ఈ మూవీతో పూర్తిగా ట్రాక్ మార్చానంటున్న అల్లరి నరేష్
meda meeda abbayi pre release function

మేడమీద అబ్బాయి సినిమాతో నా ట్రాక్ మార్చాను. ఈ సినిమా తర్వాత విభిన్నమైన కథాంశాలు నన్ను వెతుక్కుంటూ వస్తాయనే నమ్మకముంది అని అన్నారు అల్లరి నరేష్. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం మేడమీద అబ్బాయి. శ్రీమతి నీలిమ సమర్పణలో జాహ్నవి ఫిల్మ్స్  పతాకంపై బొప్పన చంద్రశేఖర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రజీత్. జి  దర్శకత్వం వహిస్తున్నారు. నిఖిల విమల్ కథానాయిక. ఈ నెల 8న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్ర ప్రీరిలీజ్ వేడుకను ఆదివారం హైదరాబాద్‌లో  నిర్వహించారు. బిగ్‌సీడీతో పాటు చిత్ర గీతాలను హీరోలు నిఖిల్, సందీప్‌కిషన్ విడుదలచేశారు.

 

అల్లరి నరేష్ మాట్లాడుతూ హాస్యనటుడు కృష్ణభగవాన్ సూచించిన ఈ టైటిల్‌ను 2012లో రిజిస్టర్ చేయించాను. అప్పటినుంచి కాపాడుకుంటూ వస్తున్నాను. నాని, నేను ఎప్పుడు కలిసిన సినిమాల గురించే ఎక్కువగా మాట్లాడుకుంటాం. నీలో మంచి  నటుడు ఉన్నాడు కామెడీ మాత్రమే కాకుండా కొత్తగా ప్రయత్నించమని,  గమ్యంలాంటి సినిమాల్లో నటించమని నాని చెబుతుంటాడు. కానీ అలాంటి కథలు అస్తమానం రావు. వినోదాన్ని కాకుండా నాలో ఉన్న నటుడిగా ఆవిష్కరిస్తూ ఓ సినిమా చేయాలనుందని బొప్పన చంద్రశేఖర్ ఓ సందర్భంలో  నా దగ్గరకు వచ్చారు. కానీ కామెడీ సినిమా అయితేనే బాగుంటుందని గతంలో అతడితో కెవ్వు కేక చేశాను. చాలా రోజుల తర్వాత అప్పుడు చెప్పిన మాటను గుర్తుంచుకొని నాతో  మేడమీద అబ్బాయి చేశారాయన.

 

ప్రస్తుతం అనుసరిస్తున్న  ట్రాక్‌ను మార్చమని ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది శ్రేయోభిలాషులు, హితులు సలహా ఇచ్చారు.  ఈ సినిమా నా పంథా మార్చాను.  దీని తర్వాత మూసధోరణికి భిన్నమైన  కథలు నన్ను వెతుక్కుంటూ వస్తాయని  అనుకుంటున్నాను. మాతృకకు మించి విజయాన్ని సాధించాలనే తపనతో కష్టపడి ప్రజీత్ ఈ సినిమా చేశారు. ఈ సినిమా విషయంలో చాలా పాజిటివ్‌గా ఉన్నాను. చాలా కాలం తర్వాత పెద్ద హిట్ కొట్టబోతున్నానని గ్యారెంటీగా చెబుతున్నాను అని అన్నారు.  తెలుగులో తన తొలి చిత్రమిదని, తనపై ఉన్న నమ్మకంతో బొప్పన చంద్రశేఖర్ ఈ సినిమాలో అవకాశమివ్వడం ఆనందంగా ఉందని హీరోయిన్ నిఖిల విమల్ చెప్పింది.

 

నాని మాట్లాడుతూ నరేష్  పంథా మారిస్తే బాగుండునని చాలా రోజుల  నుంచి కోరుకుంటున్నాను. తనలో మంచి నటుడు ఉన్నాడు.  కామెడీ బాగా చేస్తాడనే ఇమేజ్ ఛట్రంలో బందీ అయిపోయాడు. వినోదంతో పాటు భావోద్వేగాలకు  ప్రాధాన్యతనిస్త్తూ నరేష్ చేసిన సినిమా ఇది.  భవిష్యత్తులో అతడు విభిన్నమైన సినిమాలు మరిన్ని చేయాలి. మేడమీద అబ్బాయి అందుకు నాందిగా నిలవాలి. ట్రైలర్ సహజత్వాన్ని ప్రతిబింబిస్తూ అద్భుతంగా ఉంది అని తెలిపారు. నరేష్ కొత్త తరహా పాత్రల్లో ఒదిగిపోతే చూడాలని కోరుకునే వారిలో తాను ఒకరినని, అతడితో తనకున్న బంధం జయాపజయాలకు అతీతమైనది దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి పేర్కొన్నారు. అల్లరి నరేష్ పేరు ఓ బ్రాండ్‌గా మారిపోయిందని,  ఆ బ్రాండ్ నుంచి బయటకు వచ్చి ఆయన చేసిన సినిమా ఇదని, వైవిధ్యాన్ని నమ్మి తను చేసిన ప్రతి సినిమా విజయవంతమైందని,  ఆ జాబితాలో మేడమీద అబ్బాయి చేరాలని  సందీప్ కిషన్ చెప్పారు.

 

ప్రేక్షకులు కొత్తదనంతో  కూడిన సినిమాల్ని కోరుకుంటున్నారని, మేడమీద అబ్బాయి న్యూఏజ్ సినిమా అని, ధైర్యంగా, సంతోషంగా, బోల్డ్‌గా  ఆ మాటను చెబుతున్నానని హీరో  నిఖిల్ చెప్పారు. తెలుగులో తన తొలి చిత్రమిదని, ఈ భాషలో  సినిమా చేయడం అదృష్టంగా భావిస్తున్నానని చిత్ర దర్శకుడు ప్రజీత్ అన్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర నిర్మాత బొప్పన చంద్రశేఖర్, కేఎస్ రామారావు, భీమినేని శ్రీనివాసరావు, బెల్లంకొండ సురేష్, భువనచంద్ర, హైపర్ ఆది, నవీన్‌చంద్ర, అవసరాల శ్రీనివాస్,  తదితరులు పాల్గొన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios