ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, పూరి జగన్నాథ్ మంచి స్నేహితులు అనే విషయం అందరికీ తెలిసిందే. వర్మ హైదరాబాద్ వచ్చిన ప్రతీసారి పూరి జగన్నాథ్ ని కలుస్తుంటారు. అయితే వీరి మధ్య సాన్నిహిత్యం చెడిందని, శ్రీరెడ్డికి వర్మ మద్దతు ఇవ్వడంతో పూరి.. వర్మకి దూరమైనట్లు కొన్ని కథనాలు ప్రచురించారు.

'భైరవగీత' సినిమా ప్రమోషన్స్ కోసం ఇటీవల హైదరాబాద్ వచ్చిన వర్మ.. పూరిని కలవకుండా వేరే ఫ్రెండ్ ఇంట్లో ఉన్నారని టాక్. ఈ విషయం వర్మ వరకు వెళ్లడంతో ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందించారు.

''ఈ వార్తల్లో నిజం లేదు.. నేను, పూరి ఎప్పుడూలేనంత గాఢ స్నేహంలో ఉన్నాం'' అని వెల్లడించారు. ప్రస్తుతం వర్మ నిర్మాతగా వ్యవహరించిన 'భైరవగీత' సినిమా ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావల్సివుంది కానీ కొన్ని కారణాల వలన వాయిదా పడుతూ వస్తోంది. డిసంబర్ 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.