ఎంసీఏకు సోషల్ మీడియాలో నెగటివ్ టాక్... అక్కినేని ఫ్యాన్స్ పనేనా?

mca gets negative talk on social media
Highlights

  • నాని హీరోగా సాయిపల్లవి హిరోయిన్ గా దిల్ రాజు సారథ్యంలో ఎంసీఏ
  • ఈ మూవీకి సోషల్ మీడియాలో నెగటివ్ టాక్
  • అక్కినేని ఫ్యాన్స్ కావాలనే చేస్తున్నారనే ఆరోపణలు

వరుస విజయాలతో దూసుకుపోతున్న నాని నేచురల్ స్టార్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. ఈ యంగ్ హీరో.. ఇప్పుడు టాలీవుడ్‌ స్టార్ హీరోల జాబితాలో చేరుపోయాడు. నాని హీరోగా నటించిన తాజా చిత్రం ‘ఎంసీఏ మిడిల్ క్లాస్ అబ్బాయి’. హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజు సారధ్యంలో శ్రీరామ్ వేణు దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కింది. ‘ఫిదా’ ఫేమ్ సాయి పల్లవి ఈ సినిమాకు మరో ప్రధాన ఆకర్షణ కాగా అందాల నటి భూమిక ఈ మూవీతో రీ ఎంట్రీ ఇస్తోంది.
 

వరుసగా సక్సెస్‌లను ఎంజాయ్ చేస్తున్న నానికి ఈసారి నిరాశ ఎదురైందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సోషల్ మీడియాలో రొటీన్ ఫార్ములా అంటూ ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు. ఇప్పటికే విదేశాల్లో ప్రీమియర్ షోలు చూసినవారు, ఇక్కడ బెనిఫిట్ షోలు చూసినవారు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు. అయితే ఇదంతా కావాలనే చేస్తున్నారని, నెగిటివ్ టాక్ వచ్చేలా ట్విట్టర్‌లో ఈ మధ్య నెగిటివ్ రివ్యూలు ఎక్కువైపోయాయని చాలా మంది ట్వీట్ చేస్తున్నారు. నెగిటివ్ టాక్ వచ్చిన సినిమాలెన్నో హిట్లుగా మారాయని అంటున్నారు.


ముఖ్యంగా అఖిల్ రీలాంచ్ మూవీ రేపు విడుదల అవుతోన్న తరుణంలో ‘హలో’ చిత్రంతో ‘ఎంసీఏ’ను పోలుస్తున్నారు. అక్కినేని ఫ్యాన్స్ కావాలనే ట్విట్టర్‌లో నెగిటివ్ టాక్‌ను వ్యాప్తి చేస్తున్నారని కొంతమంది ట్వీట్లు పెడుతున్నారు. ఇలా కొందరు ఫస్ట్ హాఫ్ బాగుంది కానీ సెకండ్ ఆఫ్ మరీ రొటీన్‌గా ఉందని అంటున్నారు. సినిమాకు సెంటిమెంటల్ సీన్స్ ప్రధాన బలమని.. కానీ మ్యూజిక్, సెకండ్ హాఫ్ సినిమాను దెబ్బకొట్టాయని కొందరంటున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ అందించిన పాటలపై ఈసారి తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.

 

రాజీవ్ కనకాల, భూమిక, ఆమని, సీనియర్ నరేష్ ఇలా పేరున్న నటీనటులంతా నటిస్తున్న ఈ మూవీ.. క్రిస్మస్ కానుకగా ఈ శుక్రవారం (డిసెంబర్ 21న) భారీ అంచనాల మధ్య విడుదలయింది. మరి ట్విట్టర్‌లో వస్తున్న ఈ నెగిటివ్ టాక్ ‘ఎంసీఏ’ కలెక్షన్లపై ఏమాత్రం ప్రభావం చూపుతుందో చూడాలి.

 

loader