కోలివుడ్ స్టార్ హీరో అజిత్ నటించిన 'విశ్వాసం' సినిమా సంక్రాంతి కాకుండా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమ అభిమాన హీరో సినిమా రిలీజ్ అవుతుందంటే అభిమానులు ఊరుకుంటారా థియేటర్ల వద్ద అజిత్ కటౌట్లు వాటికి పాలాభిషేకాలు చేశారు.

సినిమాకి హిట్ టాక్ రావడంతో పూనకం వచ్చినట్లు ఊగిపోతున్నారు. తమిళనాడులో తిరుకొవిళూర్ లో అభిమానులు ఏర్పాటు చేసిన అజిత్ భారీ కటౌట్ ఒక్కసారిగా కూలిపడింది. ఈ ఘటనలో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

ఒకేసారి ఎక్కువమంది అభిమానులు కటౌట్ పైకి ఎక్కి పాలాభిషేకం చేయడానికి ప్రయత్నించగా.. ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గాయాలపాలైన అజిత్ అభిమానులను వెంటనే హాస్పిటల్ కి తరలించారు. ప్రస్తుతం వారు కోలుకుంటున్నట్లు సమాచారం.