టాలీవుడ్ హీరోలపై బాలీవుడ్ మేకర్స్ కన్ను గట్టిగానే పడినట్టుంది. మన హీరోలతో .. బాక్సాఫీస్ పై కాసుల పంట పండించుకుందామని చూస్తున్నారు. ఇప్పటికే మనవాళ్లలో చాలా మంది హిందీ తెరపై మెరవగా.. ప్రస్తుతం బీటౌన్ మేకర్స్ కన్ను మాస్ మహారాజ్ పై పడింది.  

బాలీవుడ్ లో మన హీరోల హవా పెరిగింది. బాలీవుడ్ హీరోల సినిమాలు ప్లాప్ అవుతుండటంతో.. మన హీరోల సినిమాలు బాలీవుడ్ బాక్సాఫీస్ ను ఏలుతున్నాయి. మన తెలుగు ముఖాలు కనిపిస్తే.. వారి సినిమాలకు కనక వర్షం కురుస్తోంది. దాంతో మన హీరోల కోసం పాకులాడుతున్నారు బాలీవుడ్ మేకర్స్. టాలీవుడ్ హీరోలతో హిందీలో డైరెక్ట్ సినిమాలు చేయాలని చూస్తున్నారు. అది కుదరకపోతే.. మన హీరోలను వారి సినిమాల్లో గెస్ట్ రోల్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నారు. ఈక్రమంలోను మనవాళ్లు హిదీ సినిమాల్లో కనిపించడం ఎక్కువైపోయింది. 

గతంలో హిందీ హీరోలు మన సౌత్ సినిమాల్లో గెస్ట్ రోల్స్ చేసేవారు. మన సౌత్ సినిమాలు హిందీ మార్కెట్ కోసం.. బాలీవుడ్ స్టార్స్ ను తీసుకువచ్చి మన సినిమాల్లో పెట్టుకోవడం స్టార్ట్ చేశాం. కాని ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. మన తెలుగు హీరోలు కనిపిస్తే.. బాలీవుడ్ సినిమా సూపర్ హిట్.. బాక్సాఫీస్ పై కనకవర్షం కురవడం ఖాయం. అందుకే మన తెలుగు హీరోలు బాలీవుడ్ సినిమాల్లో గెస్ట్ రోల్స్ చేస్తున్నారు. 

లాస్ట్ ఇయర్ బ్రహ్మస్త్రలో నాగార్జున అద్భుతమైన పాత్రలో కనిపించాడు.. దాంతో ఆసినిమా తెలుగులో కూడా హిట్ అయ్యింది. ఇక ఆవెంటనే నాగార్జున తనయుడు నాగచైతన్య.. అమీర్ ఖాన్ తో కలిసి.. లాల్‌ సింగ్‌ చడ్డాలో నటించాడు. కాని ఈసినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. వెరీ రీసెంట్ గా విక్టరీ వెంకటేష్.. సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న కిసీ కా భాయ్‌ కిసీ కీ జాన్‌ సినిమాలో కీలకపాత్ర పోషిస్తుండగా.. మెగా పవర్ స్టార్ చరణ్‌ గెస్ట్‌ రోల్‌లో ఓ సాంగ్ లో స్టెప్పులేయబోతున్నాడు. ఇక ఇప్పుడు బాలీవుడ్ కన్ను మరో టాలీవుడ్ మాస్ హీరో పై పడింది. 

ధమాకా, వాల్తేరు వీరయ్య, రావణాసుర ఇలా బ్యాక్‌ టు బ్యాక్‌ సినిమాలతో హిట్లు కొడుతూ.. తిరిగి ఫామ్‌లోకి వచ్చిన మాస్ మహారాజ్ రవితేజతో హిందీ మేకర్స్‌ ఓ రీమేక్‌ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. బాలీవుడ్‌ యంగ్‌ హీరో వరుణ్‌ధావణ్‌తో కలిసి రవితేజ ఓ సినిమా చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అది కూడా సౌత్ రీమేక్ సినిమాలోను ఇద్దరు కనిపించబోతున్నారట. రెండేళ్ళ క్రితం తమిళంలో కాసుల వర్షం కురిపించిన మానాడు సినిమాను బాలీవుడ్‌లో రీమేక్‌ చేయబోతున్నారు. తమిళంలో శింబు నటించిన పాత్రలో వరుణ్‌ చేయగా.. ఎస్‌.జే సూర్య రోల్‌ను రవితేజ చేయనున్నాడట. 

ఈసినిమా గురించి ప్రస్తుతం సంప్రదింపులు..చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈవార్త రూమర్ గానే ఉంది. కాని త్వరలో నిజం అయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అంతే కాదు ఈ సినిమాను రానా, ఏషియన్‌ సునీల్‌తో కలిసి కరణ్‌ జోహర్‌ నిర్మిస్తున్నాడట. దీనిపై త్వరలోనే అఫీషియల్ గా అనౌన్స్ మెంట్ కూడా వస్తుందని తెలుస్తోంది. మరి బాలీవుడ్ లో మాస్ మహారాజ ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తాడో చూడాలి.