సరైన టైటిల్ ఉంటే ఆ సినిమా పంటపండినట్లే. సినిమాకు ముందే బజ్ క్రియేట్ అవుతుంది. అలాగే ఆ టైటిల్ ని బట్టే సినిమా జానర్ ఏంటనేది అంచనా వేయగలుగుతారు. కాబట్టి దర్శకులు, నిర్మాతలు, హీరోలు తమ సినిమాలు టైటిల్ విషయంలో భారీ కసరత్తే చేసి ఫైనల్ చేస్తారు. అంతేకాదు ముందుగా కొన్ని ఫీలర్స్ జనాల్లోకి తమ స్వంత మీడియా ద్వారా వదిలి ఆ టైటిల్ కు వచ్చే రెస్పాన్స్ బట్టి పెట్టాలా వద్దా అనేది డిసైడ్ అవుతూంటారు.

ఇప్పుడు అలాంటి టైటిలే ఒకటి మారుతి, సాయి తేజ చిత్రం కోసం ప్రచారంలోకి వచ్చింది. నాగచైతన్య తో చేసిన ‘శైలజారెడ్డి అల్లుడు’ డిజాస్టర్  చిత్రం  దర్శకుడు మారుతి ని బాగా వెనక్కి తీసుకెళ్లిపోయింది. మొత్తానికి మెగా హీరో  సాయి ధరమ్ తేజ్ తో చేయడానికి ఫైనల్ అయ్యింది. మరో ప్రక్క  సాయి ధరమ్  ‘చిత్రలహరి’ చేసి చాలా కాలం తర్వాత రిలాక్స్ ఉన్నాడు.

కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందిన  ఆ చిత్రం యావరేజ్ అనుకున్నా సాయిని ఒడ్డున పడేసింది.  ఈ ఉత్సాహంతో మారుతి సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టి మళ్లీ ఫామ్ లోకి రావాలని ప్రయత్నంలో ఉన్నాడు సాయి.   ఈ నేపధ్యంలో ఈ చిత్రానికి భోగి అనే టైటిల్ ని పెట్టాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. 2020 సంక్రాంతి సమయంలో ఈ సినిమాను విడుదల చేస్తారు కాబట్టి ఆ టైటిల్ యాప్ట్ గా ఉంటుందని భావిస్తున్నారు. 

ఇక ఈ  చిత్రంలో హీరోయిన్ గా రెజీనా కసాండ్రా పేరు వినిపిస్తున్నప్పటికీ ఆమె బదులు మరొక  స్టార్ హీరోయిన్ ను తీసుకోవాలని ప్రయత్నాలైతే జరుగుతున్నట్లు సమాచారం. గీతా ఆర్ట్స్ మరియు యు వి క్రియేషన్స్ ఈ సినిమాను సంయుక్తంగా కలిసి నిర్మిస్తున్నారు.