టాలీవుడ్‌పై యంగ్ లేడీ డైరెక్టర్ కామెంట్స్.. రొమాంటిక్ సినిమాలు అడుగుతున్నారట..
`మార్టిన్ లూథర్ కింగ్` దర్శకురాలు పూజ కొల్లూరు తన ఇండస్ట్రీ అనుభవాలను పంచుకున్నారు. దర్శకత్వం వహించేందుకు అవకాశాల కోసం ఆమె నిర్మాతల చుట్టూ తిరగ్గా ఎదురైన సంఘటనలను ఆమె బయటపెట్టారు.

టాలీవుడ్‌లో లేడీ డైరెక్టర్లు చాలా తక్కువ. ఒకప్పుడు సావిత్రి, భానుమతి, విజయ్ నిర్మల, ఆ తర్వాత నందిని రెడ్డి, బి. జయ, ఆ మధ్య అపర్ణ దాస్, అలాగే లక్ష్మి సౌజన్య, గౌరి రోనాంకి వంటి వారు మెరిశారు. వారి జాబితాలో మరో కొత్త డైరెక్టర్ చేరారు. `మార్టిన్ లూథర్ కింగ్` చిత్రంతో పూజ కొల్లూరు దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు. ఇందులో సంపూర్నేష్ బాబు హీరోగా నటించడం విశేషం. సీనియర్ నరేష్, వెంకటేష్ మహా ముఖ్య పాత్రలు పోషించారు. ఓటింగ్ నేపథ్యంలో సాగే పొలిటికల్ సెటైర్‌గా ఈచిత్రాన్ని తెరకెక్కించారు. తమిళంలో వచ్చిన `మండేలా` చిత్రానికి రీమేక్.
దర్శకురాలు పూజ కొల్లూరు తన ఇండస్ట్రీ అనుభవాలను పంచుకున్నారు. దర్శకత్వం వహించేందుకు అవకాశాల కోసం ఆమె నిర్మాతల చుట్టూ తిరగ్గా ఎదురైన సంఘటనలను ఆమె బయటపెట్టారు. విజయవాడకి చెందిన పూజ.. యునైటెడ్ వరల్డ్ కాలేజ్ ఆఫ్ మహేంద్రలో ఎకనామిక్స్, ఫిజిక్స్, ఇంగ్లీష్ లిటరేచర్, ఆ తర్వాత స్పానిష్ చదివింది. దీంతోపాటు ఆర్ట్స్ కూడా చేసింది. ఒక స్పానిష్ ఫిల్మ్ చూసి ఇన్‌స్పైర్ అయిన పూజ ఒక సినిమా ద్వారా సమాజాన్ని ఎంత ప్రభావితం చేయోచ్చో ఆ సినిమా ద్వారా తెలుసుకుని దర్శకురాలిగా మారాలనుకుంది. ఆ దిశగా అడుగులు వేసింది. అమెరికాలో ఫిల్మ్స్ స్టడీస్ చేసి ఇక ప్రాక్టికల్‌గా సినిమాలు చేయాలని వచ్చింది.
అయితే ఆమె ఎన్నో కథలు తీసుకుని నిర్మాతల చుట్టూ తిరిగింది. ఇది ఇప్పుడు కాదు, ఓ ఐదేళ్ల తర్వాత తీయాల్సిన సినిమా అని దాట వేస్తుండే వారట. ఐదేళ్ల తర్వాత వస్తే, మళ్లీ అదే మాట చెప్పేవారట. కొందరు ఇలాంటివి ఎందుకు రొమాంటిక్ కామెడీ సినిమాలు చేయాలని, ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ చేయాలని చెబుతుండేవారట. తాము సినిమా చేయలేమని చెప్పలేక ఇలాంటి పదాలు వాడుతుండేవారని వాపోయింది దర్శకురాలు పూజ కొల్లూరు. దీంతో తానేంటో నిరూపించుకునేందుకు రీమేక్‌ని ఎంచుకుంది. అయితే తాను అందరిలాంటి సినిమాలు చేయాలనుకోవడం లేదని, విజయ్ నిర్మల మాదిరిగా బలమైన కథలు చెప్పాలని అనుకుంటున్నట్టు చెప్పారు.
ఇక `మార్టిన్ లూథర్ కింగ్` గురించి చెబుతూ.. `మండేలా` చిత్రం చూసినప్పుడు ఇది తాను డైరెక్ట్ చేస్తే బాగుంటుందనిపించిదట. ఇలాంటికథలు చెప్పాలనిపించి తాను చేస్తానని వెంకటేష్ మహాకి చెప్పడంతో ఆయన(మహాయాన మోషన్ పిచ్చర్స్)తోపాటు వైనాట్ స్టూడియో, రిలయన్స్ ఎంటర్‌టైనర్ వారి ప్రొడక్షన్‌లో ఈ చిత్రాన్ని నిర్మించినట్టు చెప్పారు. ఈ చిత్రంలో ఓటింగ్ ప్రయారిటీని చెబుతున్నారట. రాజకీయ నాయకుల కంటే ఓటర్ గొప్ప అని, ఓటింగ్‌పై సెటైరికల్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్టు చెప్పింది పూజ. అంతేకాదు తెలుగు రాష్ట్రాల రాజకీయాలను, ఎలక్షన్లని ప్రతిబింబించేలా ఈ సినిమా ఉంటుందన్నారు.
టాలీవుడ్‌లో లింగభేదం గురించి చెబుతూ, మహిళా దర్శకులకు ఏ పరిశ్రమలోనైనా సమస్యలు ఉంటాయి. మన పట్టుదలే మనల్ని ముందుకు నడిపిస్తుంది. మహిళలకు కొంచెం అవకాశాలు తక్కువగానే ఉంటాయి. కొందరు ఇవన్నీ ఎందుకు మీకు, రొమాంటిక్ కామెడీ సినిమాలు చేసుకోవచ్చు కదా అని అంటుంటారు. వాటిని దాటుకుని ముందుకు సాగాలని తెలిపింది. అదే సమయంలో లింగభేదం చాలా ఉంటుందని, సెట్‌లోనూ అది కనిపిస్తుందని, `మార్టిన్ లూథర్ కింగ్` షూటింగ్ టైమ్‌లో దాన్ని ఫేస్ చేసినట్టు చెప్పింది పూజ కొల్లూరు. ఈ సినిమా ఈ నెల 27న విడుదల కాబోతుంది.