ప్రముఖ టీవీ ఆర్టిస్ట్ మిలింద్ దస్తానే, అతడి భార్యని మంగళవారం నాడు పూణే పోలీసులు అరెస్ట్ చేశారు. మరాఠీకి చెందిన ఈ నటుడు తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం 'తుజ్యత్ జీవ్ రంగ్లా' అనే టీవీ సీరియల్ లో నటిస్తున్నాడు.

గతేడాదిలో మిలింద్ తన భార్య సయాలీతో కలిసి డైమండ్ రింగ్, కొంత బంగారం, సిల్వర్ కొన్నారు. దాదాపు రూ.25 లక్షల విలువ గల ఈ నగలను పూణేలో పీఎన్ గాడ్గిల్ అనే నగల షాప్ లో కొనుగోలు చేశారు. క్రెడిట్ కార్డ్ ద్వారా పాతిక లక్షలు చెల్లిస్తామని చెప్పారు.

కానీ ఇప్పటివరకు ఆ మొత్తాన్ని చెల్లించలేదు. ముంబైలో ఒక ప్రాపర్టీను అమ్మకానికి పెట్టానని, అది అమ్ముడవ్వగానే పాతిక లక్షలు వడ్డీతో సహా చెల్లిస్తానని మిలింద్ చెప్పడంతో నగల షాప్ యాజమాన్యం కొన్నిరోజులు గడువిచ్చింది.

కానీ మిలింద్ ఎంతకీ డబ్బు కట్టకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. ఐపీసీ సెక్షన్ 420, 406 ల కేసుల కింద కేసు నమోదు చేసిన పోలీసులు మిలింద్, అతడి భార్యని అరెస్ట్ చేసి రిమాండ్ కి పంపించారు.