ఆదిపురుష్ కి పనిచేసి పెద్ద తప్పు చేశా..అది భరించలేక దేశం వదిలి వెళ్ళిపోయా, రచయిత మనోజ్ ముంతషీర్
ఆదిపురుష్ చిత్రం రిలీజయ్యాక నన్ను ఆడియన్స్ చాలా ద్వేషించారు. చంపుతాం అని బెదిరించారు. విమర్శలకు నేను రియాక్ట్ కాకుండా ఉండాల్సింది.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ఆదిపురుష్ చిత్రం ఈ ఏడాది జూన్ లో విడుదలయింది. రిలీజ్ కి ముందు నుంచి ఆదిపురుష్ చిత్రంపై ఏ స్థాయిలో ట్రోలింగ్ జరిగిందో తెలిసిందే. రిలీజ్ తర్వాత విమర్శలు ఇంకా ఎక్కువయ్యాయి. హిందూ ఇతిహాసం రామాయణం ఆధారంగా తెరకెక్కించిన ఈ చిత్రంలో నటీనటుల గెటప్స్, గ్రాఫిక్స్, చిత్రాన్ని తెరకెక్కించిన విధానంపై తీవ్రమైన చర్చతో పాటు విమర్శలు వెల్లువెత్తాయి.
చిత్ర దర్శకుడు ఓం రౌత్ ఎక్కువగా ట్రోలింగ్ ఎదుర్కొన్నారు. వందలాది కోట్ల రూపాయలు వెచ్చించి రామాయణాన్ని కించపరిచారనే అపవాదు ఎదుర్కొన్నారు. మరోవైపు ఈ చిత్రానికి సంభాషణలు రచించిన రచయిత మనోజ్ ముంతషీర్ కూడా విమర్శలు ఎదుర్కొన్నారు. తాజాగా ఇంటర్వ్యూలో మనోజ్ ఆదిపురుష్ చిత్ర అనుభవం పై స్పందించారు.
ప్రపంచం మనల్ని ఒకరోజు చెడ్డవాడిగానూ ఒకరోజు మంచివాడిగానూ చూస్తుంది. కానీ మన కుటుంబానికి మాత్రం మనం ఎప్పుడూ హీరోలమే అని మనోజ్ అన్నారు. కానీ నేను ఒక తప్పు చేశాను. అది ఆదిపురుష్ చిత్రానికి పనిచేయడమే. ఆదిపురుష్ మూవీ నాకు ఎన్నో పాఠాలు నేర్పింది. ఇక నుంచి జాగ్రత్తగా వ్యవహరించాలని అనుకుంటున్నట్లు మనోజ్ తెలిపారు.
ఆదిపురుష్ చిత్రం రిలీజయ్యాక నన్ను ఆడియన్స్ చాలా ద్వేషించారు. చంపుతాం అని బెదిరించారు. విమర్శలకు నేను రియాక్ట్ కాకుండా ఉండాల్సింది. తీవ్రమైన విమర్శలు రావడంతో కొంతకాలం విదేశాలకు వెళ్ళిపోయాను అని మనోజ్ తెలిపారు. ఎన్నో హిట్ చిత్రాలకు పనిచేసిన తనకు ఇప్పుడు సెకండ్ ఛాన్స్ కావాలని మనోజ్ ముంతషీర్ అన్నారు. మనోజ్ బాహుబలి హిందీ డబ్బింగ్ కి కూడా సంభాషణలు అందించారు.