మెగాస్టార్ చిరంజీవిలో కామెడీ యాంగిల్ గురించి ఎవరికీ తెలియదని.. ఆయన కామెడీ చేస్తే హాస్యబ్రహ్మ బ్రహ్మానందం కూడా తట్టుకోలేరని చెబుతున్నారు ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ. మణిశర్మ, చిరంజీవి కాంబినేషన్ లో ఎన్నో సినిమాలు వచ్చాయి.

చిరంజీవి అంటే మణిశర్మకి ఎంతో అభిమానం. అన్నయ్య అంటూ ఎంతో ప్రేమగా పిలుస్తుంటారు. చిరుపై తనకున్న ప్రేమను ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు మణిశర్మ. అన్నయ్య సినిమాకి సంగీతం అందించాల్సివస్తే తనకు తెలిసిన అన్ని బీట్స్ వాడేస్తానని చెప్పాడు మణిశర్మ. మా ఇద్దరి కాంబినేషన్ లో ఏది బెస్ట్ సినిమా అని చెప్పలేనని.. అసలు ఆ ప్రశ్న కూడా వృధానే అని తెలిపారు.

అన్నయ్య బాగా కామెడీ చేస్తారని.. ఆయనలో పూర్తి కామెడీ కోణాన్ని ప్రేక్షకులు చూడలేదని చెప్పారు. అన్నయ్య కామెడీ చేస్తే బ్రహ్మానందం కూడా తట్టుకోలేరని అన్నారు. చిరు తనకు ఒక్క రూపాయి రెమ్యునరేషన్ ఇవ్వకపోయినా.. ఆయనతో సినిమా చేయడానికి రెడీగా ఉన్నానని, తన ఆర్కెస్ట్రా ఖర్చులన్నీ కూడా భరిస్తానని చెప్పారు. 

అంతేకాదు.. సినిమా రిలీజ్ వేడుక కూడా తనే ఏర్పాటు చేస్తానని చిరు మీద తనకున్న ప్రేమను వ్యక్తపరిచారు. తన జీవితంలో ఇద్దరు వ్యక్తులను మాత్రమే అన్నయ్య అని పిలుస్తానని అందులో ఒకరు చిరంజీవి అని చెప్పారు.